జాట్‌ల ఆందోళన ఉధృతం | Jat violence spreads in Haryana, 5 more killed | Sakshi
Sakshi News home page

జాట్‌ల ఆందోళన ఉధృతం

Published Sun, Feb 21 2016 12:43 AM | Last Updated on Sun, Sep 3 2017 6:03 PM

జాట్‌ల ఆందోళన ఉధృతం

జాట్‌ల ఆందోళన ఉధృతం

♦ ఆరుకు చేరిన మృతుల సంఖ్య
♦ రైల్వేస్టేషన్లు, బ్యాంకు,పాలశీతలీకరణ కేంద్రానికి నిప్పు
♦ కాల్చివేత ఆదేశాలూ భేఖాతరు..
♦ డీపీఆర్వో సజీవదహనానికి విఫలయత్నం
♦ హరియాణా పరిస్థితిపై కేంద్ర మంత్రి వర్గం సమీక్ష
 
 రోహ్‌తక్: ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండుతో జాట్‌లు చేస్తున్న ఆందోళనతో హరియాణా అట్టుడుకుతోంది. చాలాచోట్ల ఆందోళనకారులు రోడ్డు, రైలు రవాణా వ్యవస్థతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను తగులబెట్టారు. శనివారం ఒక్కరోజే ఈ ఆందోళనలను అడ్డుకునేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతిచెందగా.. మొత్తం మృతుల సంఖ్య ఆరుకు చేరింది. కర్ఫ్యూ విధించినా, కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేసినా.. జాట్‌ల విధ్వంసం కొనసాగుతోంది. శనివారం ఉదయం జింద్ జిల్లాలోని బుధఖేరా రైల్వేస్టేషన్‌కు ఆందోళనకారుల నిప్పుపెట్టారు. రికార్డు గదితో పాటు స్టేషన్‌లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.

ఝాజ్జర్‌లోని మంత్రి ఓపీ ధన్‌కర్ ఇంటిపై ఆందోళనకారులు రాళ్లు విసిరారు. ఝాజ్జర్‌లో డీపీఆర్వో వాహనానికి నిప్పుపెట్టడంతో.. అధికారితోపాటు నలుగురు ఉద్యోగులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రోహ్‌తక్‌లో ప్రభుత్వ డైరీ కార్పొరేషన్ పాలకేంద్రానికీ నిరసనకారులు నిప్పంటించారు. ఈ కేంద్రంలోని గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం ఉన్నందున స్థానికులను ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. శనివారం పొద్దుపోయిన తర్వాత పిలుఖేరాలో రైల్వేస్టేషన్, భునాలో తెహసిల్ కార్యాలయం, గోరఖ్‌పూర్ గ్రామంలో సహకార బ్యాంకు భవనానికి ఆందోళనకారులు నిప్పంటించారు. హరియాణాలోని తొమ్మిది జిల్లాల్లో ఇవే ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ఆర్మీ వాహనాలు తిరగటం కూడా కష్టమవటంతో.. హెలికాప్టర్లలో జవాన్లను ఆయా ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది.

మరోవైపు కర్ఫ్యూ, కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు అమల్లో ఉన్న రోహ్‌తక్, భివానీ జిల్లాల్లో ఆర్మీ ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించింది.  సోనిపట్, గొహానా, ఝాజర్ ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో.. కర్ఫ్యూ విధించారు. హిస్సార్, కైథాల్ జిల్లాల్లో జాట్‌లు, జాటేతరుల మధ్య గొడవలు జరిగి 10 మందికి తీవ్రంగా గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. తాజా పరిస్థితిని సమీక్షించిన హరియాణా సీఎం ఖట్టర్ జాట్‌ల రిజర్వేషన్ డిమాండును నెరవేరుస్తామని, ఆందోళన విరమించాలని కోరారు. అయితే.. ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీ వచ్చేంతవరకు ఉద్యమం ఆగదని జాట్ ఉద్యమ నాయకుడు యశ్‌పాల్ మాలిక్ తెలిపారు. జాట్‌లకు రిజర్వేషన్ ఇచ్చి ఓబీసీ కోటాకు నష్టం కలిగిస్తే.. రాజీనామాకు వెనుకాడనన్న కురుక్షేత్ర ఎంపీ సైనీ వ్యాఖ్యలపైనా జాట్లు మండిపడ్డారు.

ఈ ఆందోళనతో.. 800 రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. దాదాపు 25 నుంచి 30 వేల మంది తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని రైల్వేశాఖ తెలిపింది. కాగా, హరియాణాలో పరిస్థితిపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్, విదేశాంగ మంత్రి సుష్మ, రక్షణ మంత్రి పరీకర్, రోడ్డు రవాణా మంత్రి గడ్కారీ, జాతీయ భద్రతా సలహాదారు దోవల్, ఆర్మీ చీఫ్ దల్బీర్, హోం సెక్రటరీ, ఐబీ చీఫ్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు శనివారం సమీక్ష జరిపారు.  రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించాలని, శాంతిభద్రతలను కాపాడాలని హరియాణా ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. హరియాణాలో ఆందోళనల నేపథ్యంలో యూపీకి చెందిన జాట్ నేతలు రాజ్‌నాథ్‌ను కలసి రిజర్వేషన్ డిమాండును నెరవేర్చాలని కోరారు. దీనికి రాజ్‌నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారు. దీని ప్రభావంతో మారుతి సుజుకీ.. గురుగావ్‌లోని తయారీకేంద్రంలో కార్ల ఉత్పత్తిని నిలిపేసింది.
 
 ఢిల్లీని తాకిన సెగ
 అటు జాట్‌ల ఆందోళన ప్రభావం ఢిల్లీపై పడింది. దేశ రాజధానికి యమునా నీటిని అందించే మునాక్ కెనాల్‌ను ఆందోళనకారులు మూసేయటంతో సమస్యలు మొదలయ్యాయి. దీంతో కెనాల్‌ను తిరిగి తెరిచేలా చొరవతీసుకోవాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హరియాణా సీఎం ఖట్టర్‌లను కేజ్రీవాల్ కోరారు. ఈ కెనాల్ చుట్టూ సైన్యాన్ని మోహరించి నీటిని విడుదల చేయిస్తామని రాజ్‌నాథ్ హామీ ఇచ్చారని కేజ్రీవాల్ ట్వీటర్‌లో వెల్లడించారు. ఈ ఆందోళన మరిన్ని రోజులు కొనసాగితే గురుగావ్, నోయిడా, ఢిల్లీల్లో నిత్యావసర వస్తువుల కొరత తప్పకపోవచ్చు. అటు ఢిల్లీ విశ్వవిద్యాలయం నార్త్ క్యాంపస్ బయట జాట్ విద్యార్థులు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శన నిర్వహించడంతో ఈ మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement