
రన్ వేపై అదుపుతప్పిన విమానం
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం బుధవారం రన్ వేపై దిగుతూ అదుపుతప్పి పక్కకు వెళ్లిపోయింది. ఈ ఘటన ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం డెహ్రాడూన్ నుంచి న్యూఢిల్లీకి 65 మందితో బయల్దేరిన విమానం రన్ వేపై దిగుతుండగా అదుపు తప్పింది.
పైలట్ చాకచక్యంగా విమానాన్ని అదుపు చేయడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రయాణీకులకు ఎలాంటి గాయాలు కాలేదని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ల్యాండవుతున్న సమయంలో విమాన ముందు చక్రంలో సాంకేతికలోపం తలెత్తడంతో స్టీరింగ్ సమస్య వచ్చినట్లు వివరించారు. పాసింజర్లందరిని వేరే విమానాల ద్వారా గమ్యస్ధానాలకు చేర్చినట్లు వెల్లడించారు.