యూనివర్సిటీలో గొడవ.. విద్యార్థి అదృశ్యం
దేశ రాజధానిలోని ప్రఖ్యాత జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఒక విద్యార్థి అదృశ్యమయ్యాడు. హాస్టల్లో జరిగిన గొడవ తర్వాతే అతడు కనిపించకపోవడంతో.. అతడి తల్లిదండ్రులు యూనివర్సిటీ వద్ద ఆందోళనకు దిగారు. యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ బయోటెక్నాలజీలో చదువుతున్న నజీబ్ అహ్మద్.. కేవలం 15 రోజుల క్రితమే యూనివర్సిటీలో చేరాడు. ఇక్కడకు వచ్చి తమ కొడుకు కనిపించకుండా పోయాడని.. అతడు ఎక్కడున్నాడని నజీబ్ తల్లి ఆవేదనగా ప్రశ్నించారు. అతడికి ఏమైందో కూడా తెలియడం లేదని.. తన కొడుకును తిరిగివ్వాలని అడిగారు. ఉత్తరప్రదేశ్‌లోని బదయూ ప్రాంతానికి చెందిన ఆమె.. అర్ధరాత్రి ఫోన్ కాల్ రావడంతో కంగారు పడుతూ వచ్చారు.
నజీబ్‌కు ఏబీవీపీ కార్యకర్తలతో గొడవ అయ్యిందని, మెస్ కమిటీ ఎన్నికల కోసం రాత్రిపూట ప్రచారం జరుగుతుండగా ఈ గొడవ జరిగిందని వామపక్ష కార్యకర్తలు ఆరోపించారు. ఏబీవీపీ అభ్యర్థిని నజీబ్ చెంపమీద కొట్టాడని.. దాంతో మరింతమంది కార్యకర్తలు అక్కడకు వచ్చి అతడిని కొట్టారని అంటున్నారు. అయితే ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రం ఈ అంశాన్ని తీవ్రంగా ఖండించారు. వామపక్ష కార్యకర్తలు గొడవలో జోక్యం చేసుకుని.. నజీబ్‌ను బాత్రూంలో దాచేశారని, తర్వాత అతడిని వార్డెన్ సమక్షంలో బయటకు తీసుకెల్లారని.. ఆ తర్వాత ఏమైందో మాత్రం తెలియడం లేదని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. తర్వాతి రోజు ఉదయం నుంచి నజీబ్ కనిపించకుండా పోయాడు. సోమవారం నాడు అతడు కిడ్నాప్ అయినట్లు కేసు దాఖలైంది. అతడి కోసం క్యాంపస్ మొత్తం గాలింపు మొదలైంది.