
బాలనేరస్తుల సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ: బాలనేరస్తుల చట్ట సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. మంగళవారం రాజ్యసభలో ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం ఆమోదం లభించింది. బాలనేరస్తుల వయస్సును 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించారు. బాలనేరస్తుల చట్ట సవరణ బిల్లును లోక్సభ ఇదివరకే ఆమోదించిన సంగతి తెలిసింది. తాజాగా రాజ్యసభలో ఆమోదం లభించడంతో రాష్ట్రపతికి పంపనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశాక బిల్లు చట్టరూపం దాల్చనుంది.
మూజువాణీ ఓటుతో రాజ్యసభ ఈ చట్ట సవరణ బిల్లును ఆమోదించింది. పెద్దవాళ్లలా తీవ్రమైన నేరాలకు పాల్పడే మైనర్ల విషయంలో వయోపరిమితిని 18 నుంచి 16 ఏళ్లకు తగ్గిస్తూ ఈ సవరణనను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. బిల్లును పార్లమెంటరీ సెలక్ట్ కమిటీకి సమీక్ష కోసం పంపాలని సీపీఎం నేత సీతారాం ఏచూరి సూచించారు. కానీ రాజ్యసభ దాన్ని ఆమోదించకపోవడంతో సీపీఎం సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ ఈ బిల్లుపై చర్చను ప్రారంభించారు. ఇటీవలి కాలంలో మైనర్లు పాల్పడిన క్రూరమైన నేరాల చిట్టాను ఆమె సభలో చదివి వినిపించారు.
రాజ్యసభలో ఈ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో జ్యోతి సింగ్ పాండే (నిర్భయ) తల్లిదండ్రులు ఆశాదేవి, బద్రీనాథ్ కూడా సభకు విజిటర్లుగా హాజరయ్యారు. 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో కదులుతున్న బస్సులో దారుణమైన సామూహిక అత్యాచారానికి గురైన జ్యోతి సింగ్.. 13 రోజుల తర్వాత సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. ఆ కేసులో మైనర్ నిందితుడిని ఇటీవల బాల నేరస్థుల సంస్కరణ కేంద్రం నుంచి మూడేళ్ల తర్వాత విడుదల చేయడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.