శ్రీనగర్ : కొడుకు భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటున్న అక్కడి తల్లిదండ్రులకు.. గుండెకోతే మిగులుతుంది. ఉన్నత భవిష్యత్తును నాశనం చేసుకుని మరీ కశ్మీర్ యువత ఉగ్రవాదంవైపు వాళ్లు అడుగులు వేస్తున్నారు. అలాంటి తల్లుల జాబితాలో అయేషా ఖాన్ కూడా చేరిపోయారు.
ఆమె కొడుకు 20 ఏళ్ల మజీద్ ఖాన్.. యూజీలో కామర్స్ రెండో ఏడాది చదువుతున్నాడు. టెన్త్, ఇంటర్‌లో అతను స్టేట్ ర్యాంకర్ కూడా. పైగా అనంతనాగ్ జిల్లా ఫుట్ బాల్ జట్టు గోల్ కీపర్ కూడా. ఇది చాలదన్నట్లు ఓ ఎన్జీవో తరపున వైద్య సేవలను అందించటంలో సాయం చేస్తుంటాడు. అంతటి మంచోడు ఉన్నట్లుండి వారం క్రితం అదృశ్యమయ్యాడు. ఏమైందోనని అంతా కంగారుపడుతున్న సమయంలో లష్కరే తా ఇయిబాలో చేరినట్లు గత గురువారం వీడియోను రిలీజ్ చేసి కలకలం రేపాడు.
అంతే ఆ దృశ్యాలను చూసిన ఆయన తండ్రి(ఇర‍్షద్ అహ్మద్ ఖాన్.. ప్రభుత్వ ఉద్యోగి) గుండెపోటుతో కుప్పకూలిపోయి మంచానపడ్డాడు. తల్లి రోదనలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు కూతుళ్లకు వివాహాలు అయిపోయాయి. ఉన్నది ఒక్కగానొక్క కొడుకు... దీంతో ఎలాగైనా సరే వెనక్కి వచ్చేయంటూ అతనికి వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కన్నపేగు దూరం కావటంతో విలపిస్తున్న ఆమెను ఓదార‍్చటానికి వచ్చిన స్థానిక మహిళల ముఖంలో ఎలాంటి స్పందన కనిపించటం లేదు. కారణం వారిలో చాలా మంది కుటుంబ సభ్యులు ఇలా ఉగ్రవాదంవైపు వెళ్లిపోవటమే.
మజీద్‌ను ప్రభావితం చేసిన అంశం?
ఇంతకీ మజీద్ ఉగ్రవాదంవైపు వెళ్లటానికి గల కారణంపై స్నేహితులు ఓ కథనం చెబుతున్నారు. యవార్ నిసార్.. మజీద్‌కు అత్యంత సన్నిహితుడు. కొన్నాళ్ల క్రితం ఉగ్రవాదంలో చేరిన యవార్ పోలీస్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. ఆ సమయంలో మృతదేహాంపై పడి మజీద్ ఘోరంగా విలపించాడు. ఆ ఘటన స్థానిక మీడియాలో ప్రముఖంగా కూడా ప్రసారం అయ్యింది. ఈ నేపథ్యంలో స్నేహితుడి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకే మజీద్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడేమోనని కొందరు స్నేహితులు చెబుతున్నారు. ఇక మజీద్ స్నేహితులు అతని ఫేస్ బుక్ పేజీలో వెనక్కి వచ్చేయంటూ పోస్టులు పెడుతూ విజ్ఞప్తి చేస్తున్నారు.
అధికారులు కూడా అతన్ని వెనక్కి రప్పించేందుకు తమ వంతుగా ప్రయత్నాలు ప్రారంభించారు. స్థానికంగా ఉన్న కొందరు దౌత్యవేత్తల ద్వారా ఉగ్రనేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే అతని నుంచి సానుకూల స్పందన రావటం లేదని తెలుస్తోంది. అక్కడి యువత టెర్రరిస్టులుగా మారటం అన్నది కొన్ని దశాబ్దాలుగా సర్వసాధారణమైపోయింది. అయితే ఈ ఏడాది కాలంలో అది మరింత ఎక్కువైంది. ఈ జూలై నుంచి సెప్టెంబర్ దాకా మొత్తం 41 మంది యువకులు మిలిటెంట్లలలో చేరిపోగా.. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 170 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిపెట్టినట్లు అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment