కేదార్‌నాథ్ ప్రారంభం
ఆలయాన్ని సందర్శించిన రాహుల్ గాంధీ
కేదార్‌నాథ్: ఆరు నెలల శీతాకాల విరామం తర్వాత చార్‌ధామ్ క్షేత్రాల్లో ఒకటైన ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయాన్ని శుక్రవారం తెరిచారు. దేశం నలుమూలల నుంచి తరలి వచ్చిన భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కేదారేశ్వరుడిని దర్శించుకున్నారు.
ఇందుకోసం 16 కి.మీ ఆలయ కొండ మార్గాన్ని ఆయన కాలిబాటన చేరుకున్నారు. గురువారం లించోలీ వరకూ 10 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి రాత్రికి అక్కడే బస చేసిన ఆయన శుక్రవారం అక్కడి నుంచి మరో 6 కిలోమీటర్లు నడిచి ఆలయానికి వచ్చారు. రాహుల్ వెంట ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ తదితరులు ఉన్నారు. తాను కాలిబాటన ఆలయానికి చేరుకోవడం వెనుక రెండు ఉద్దేశాలు ఉన్నాయని రాహుల్ విలేకర్లతో అన్నారు. 2013 నాటి కేదార్ వరద మృతులకు నివాళులర్పించడంతోపాటు అభద్రతాభావంలో కొట్టుమిట్టాడుతున్న పోర్టర్లలో ఆత్మస్థైర్యం నింపేందుకు కాలిబాట ఎంచుకున్నానన్నారు. దేవుడిని ప్రత్యేకంగా ఏదీ కోరుకోలేదని...కానీ ఆలయంలోకి ప్రవేశించగానే అగ్ని వంటి శక్తి అనుభూతి చెందానన్నారు.