ప్రతి ఎమ్మెల్యే ముందు కంప్యూటర్
తిరువనంతపురం: మరో రికార్డుకు కేరళ తెరతీసింది. అసలు కాగితం అవసరాలు లేకుండా సభా వ్యవహారాలు నడిపేందుకు సర్వత్రా సిద్ధమైంది. ఈ మేరకు ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గురువారం ఒక ప్రకటన చేశారు. 'హిమాచాల్ ప్రదేశ్ ఇప్పటికే అసెంబ్లీ పేపర్ లెస్ కార్యక్రమాలు చేస్తోంది. మేం కూడా దానిని సాధించాలని అనుకుంటున్నాం' అని స్పీకర్ అన్నారు. సెప్టెంబర్ 26న కేరళ అసెంబ్లీ ప్రారంభం కానుంది. మొత్తం 29 రోజులపాటు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉందట.
నవంబర్ 10న సమావేశాలు ముగుస్తాయని తెలుస్తోంది. ఆన్ లైన్ లోనే ప్రశ్నలు అడగాలని ఇప్పటికే 140మంది శాసన సభ్యులకు సూచనలు కూడా చేశారట. పూర్తి స్థాయిలో పేపర్ లెస్ కార్యక్రమం కోసం తమ చట్టసభ్యులకు ప్రత్యేక తర్ఫీదును ఇవ్వనున్నట్లు కూడా స్పీకర్ చెప్పారు. ఒక్కసారి ఈ శిక్షణ పూర్తయిన తర్వాత ప్రతి ఒక్క సభ్యుడి ముందు ఓ కంప్యూటర్ ఉంటుందని, ఒక్క క్లిక్ తో అతడు సభాకార్యక్రమాలు మొత్తం చూడొచ్చని, సభకు సంబంధించి అవసరమైన పనులు చేసుకోవచ్చని అన్నారు.