తిరువనంతపురంః ఓనం పండుగ సందర్భంలో మద్యం ఆన్లైన్ అమ్మకాలకు ప్రతిపాదించిన కేరళ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ఆన్లైన్ లో మద్యం అమ్మకాలపై అన్ని వర్గాలనుంచి విమర్శలు ఎదుర్కోవడంతో తన ప్రణాళికను అమల్లోకి తేకుండా విరమించుకుంది. అన్లైన్ లోమద్యం ద్వారా విదేశీ వాణిజ్యాన్నిచేపట్టాలనే ప్రతిపాదనను ప్రభుత్వం తెచ్చిందంటూ వచ్చిన వార్తలను కొట్టిపారేసిన ప్రభుత్వం.. అటువంటి నిర్ణయం తీసుకోవడంలేదంటూ స్సష్టం చేసింది.
రాష్ట్ర కో ఆపరేటివ్ కన్జూమర్ ఫెడరేషన్ గానీ, ప్రభుత్వం గానీ ఆన్లైన్ లిక్కర్ ట్రేడ్ పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పర్యాటక, సహకారమంత్రి ఎసి మొయిద్దీన్ తెలిపారు. మీడియాలో వచ్చిన వార్తలు నిరాధారమైనవని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే ప్రభుత్వ నిర్ణయంపై వార్తలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రతిపక్షాలు విరుచుకు పడ్డాయి. ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఇటువంటి ప్రణాళికలు చేయడం లిక్కర్ లాబీలో భాగమని, ప్రభుత్వ నిర్ణయాలు కేరళలో మద్యం వినియోగాన్ని పరోక్షంగా ప్రోత్సహిస్తున్నట్లుగా ఉన్నాయని ప్రతిపక్ష నాయకుడు రమేష్ చెన్నితాల విమర్శలు గుప్పించారు. మరోవైపు ఓనం పండుగ సమయంలో ప్రభుత్వ ప్రతిపాదన.. రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మనం రాజశేఖరన్ విమర్శించారు.
సెప్టెంబర్ రెండోవారంలో జరిగే ఓనం పండుగ కోసం లిక్కర్ ను ఆన్లైన్ లో అమ్మేందుకు కేరళ సర్కారు 59 బ్రాండ్లను అందుబాటులో ఉంచనున్నట్లు రెండురోజులుగా వార్తలు వస్తున్నాయి. కేరళలో మొత్తం 36 రిటైల్ మద్యం అవుట్ లెట్లు ఉండగా... ఫైవ్ స్టార్ హోటళ్ళలో తప్పించి, మిగిలిన చోట్ల మద్యం విక్రయాలను నిషేధిస్తూ కేరళ ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్ లో ఆదేశాలు జారీ చేసింది. దీంతో అప్పట్లో సుమారు 700 లకు పైగా బార్లు మూత పడ్డాయి. లిక్కర్ బ్యాన్ చేయడంతో ప్రధాన పర్యాటక కేంద్రమైన కేరళలో పర్యాటకుల రాక గణనీయంగా తగ్గినట్లు అనంతరం ప్రభుత్వం గుర్తించింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు మద్యం అమ్మకాలు పెంచడంతోపాటు, ఆన్లైన్ అమ్మకాలు జరిపితే.. ఇటు లిక్కర్ పరిశ్రమ అభివృద్ధితోపాటు.. అటు పర్యాటక శాఖ అభివృద్ధి చెందుతుందని భావించింది. కానీ ప్రభుత్వ ప్రణాళికపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో వెనుకంజ వేసింది. అటువంటి నిర్ణయాలేమీ తాము తీసుకోలేదని, ఒకవేళ తమ ముందుకు అటువంటి ప్రతిపాదనలు వస్తే నిర్ణయంపై ఆలోచిస్తామని ఎక్సైజ్ మంత్రి టి పి రామకృష్ణన్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఆన్లైన్ లిక్కర్ సేల్ లేనట్లే..
Published Sat, Aug 20 2016 2:07 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM
Advertisement
Advertisement