ప్రతీకాత్మక చిత్రం
తిరువనంతపురం : వైద్యుల నిర్వాకం ఓ మహిళ నిండు జీవితాన్ని ప్రశ్నార్థకం చేసింది. వారి అవగాహనలేమి, నిర్లక్ష్యం ఆమె పాలిట శాపంగా మారింది. క్యాన్సర్ లేకున్నా కీమోథెరపీ చేయడంతో శరీరం బలహీనమవడంతో పాటు బతుకుభారంగా మారింది. వివరాలు.. కేరళలోని కొట్టాయంకు చెందిన రజని(38) ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని పోషించేది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం రొమ్ములో గడ్డలు రావడంతో ఆస్పత్రికి వెళ్లగా.. వైద్యులు ఆపరేషన్ నిర్వహించి తీసేశారు. అనంతరం వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. కానీ రిపోర్టులు రాకముందే రజనీకి బ్రెస్ట్ క్యాన్సర్ సోకిందని నిర్ధారించిన వైద్యులు ఆమెకు కీమోథెరపీ మొదలు పెట్టారు. కొట్టాయం గవర్నమెంటు మెడికల్ కాలేజీలో చికిత్స నిర్వహిస్తున్న క్రమంలో ఆమెకు కాన్సర్ లేదనే విషయం బయటపడింది.
అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కీమోథెరపీతో జుట్టంతా ఊడిపోవడంతో పాటు రజనీ శరీరం బలహీనమై పోయింది. అంతేకాకుండా మందుల కోసం భారీగా ఖర్చుపెట్టడంతో ఆర్థికంగా కూడా ఆమె చితికిపోయింది. ఈ క్రమంలో మీడియా ముందు రజనీ తన గోడు వెళ్లబోసుకుంది. దీంతో కేరళ ఆరోగ్యశాఖ మంత్రి ఈ ఘటనపై నివేదిక సమర్పించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment