తిరగబడిన మద్యం ట్రక్కు.. జనాలకు పండగ
అది దేశ రాజధాని ఢిల్లీలోని చిరాగ్ దిల్లీ ఫ్లైఓవర్ ప్రాంతం. ఉన్నట్టుండి అక్కడ ఒక్కసారిగా జనం గుంపులు గుంపులుగా చేరారు. చేతికి దొరికింది అందిపుచ్చుకుని అక్కడి నుంచి సంతోషంగా వెళ్తున్నారు. మరికొందరు మళ్లీ మళ్లీ వస్తూ తీసుకుంటున్నారు. ఏంటా అని చూస్తే.. అక్కడ ఓ మద్యం ట్రక్కు తిరగబడింది. దాంతో దొరికిన సీసాలు దొరికినట్లుగా మందుబాబులు వాటిని తీసుకెళ్లి పండగ చేసుకున్నారు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే అక్కడున్న మొత్తం స్టాకు అంతా మాయమైపోయింది. మామూలు చొక్కాలు వేసుకున్నవాళ్ల కంటే... చలిగా ఉందని జాకెట్లు వేసుకున్నవాళ్లు మరింత అదృష్టవంతులుగా మిగిలారు. వాళ్లు ఆ లోపల నాలుగైదు బాటిళ్లు తీసుకుని చక్కా వెళ్లారు.
హరియాణాలోని ఝజ్జర్ ప్రాంతం నుంచి మద్యం లోడుతో వచ్చిన మినీ ట్రక్కు డివైడర్‌ను ఢీకొని తిరగబడింది. లోపల సరుకును జాగ్రత్తగా కాపాడాల్సిన డ్రైవర్.. అక్కడినుంచి పారిపోయాడు. దాంతో జనం సీసాలు తీసుకుని వెళ్లిపోయారు. బహుశా హరియాణాలో మాత్రమే అమ్మాల్సిన మద్యాన్ని అక్రమంగా ఢిల్లీకి తీసుకొచ్చి ఉంటారని, అందుకే డ్రైవర్ పారిపోయాడేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. ట్రక్కు తిరగబడటంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది. కొన్ని సీసాలు పగిలిపోయి మద్యం అక్కడ ప్రవహించడంతో మందుబాబులు బాధపడ్డారు. వాసన గుర్తించిన ఒకరిద్దరు బైకర్లు మిగిలిన సీసాలు తీసుకెళ్తుండటంతో.. ఇంకా చాలామంది వచ్చి తమకు దక్కింది తీసుకున్నారు.
ఈ విషయం సమీప కాలనీల వాళ్లకు తెలిసి వాళ్లు కూడా వచ్చేశారు. కొందరు కార్లలో వచ్చినవాళ్లయితే రెండు మూడు బాక్సులు తీసుకెళ్లిపోయారు. నెహ్రూ పార్కు వైపు నుంచి ఎయిర్‌పోర్టు వైపు ఈ ట్రక్కు వెళ్తోందని పోలీసులు తెలిపారు. దక్షిణ ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌కు వెళ్లాల్సిన బాగా ఖరీదైన విస్కీ అందులో ఉన్నట్లు ప్రచారం జరగడంతో జనం తండోపతండాలుగా వచ్చి పండగ చేసుకున్నారు.