హవ్వా... అక్కడ సెల్ఫీనా?
ముంబై: మహారాష్ట్ర నీటి సంరక్షణ శాఖ మంత్రి పంకజా ముండే మరో వివాదంలో చిక్కుకున్నారు. కరువుతో అల్లాడుతున్న లాతూరు జిల్లాలో ఆదివారం సెల్ఫీ తీసుకుని ట్విటర్ లో పోస్టు చేయడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి.
లాతూరు జిల్లా వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న ఆమె పూర్తిగా ఎండిపోయిన మంజీరా నది పునరుద్ధరణకు సియా గ్రామం వద్ద ప్రభుత్వం చేపట్టిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నది ఒడ్డున నిలబడి తన సెల్ ఫోన్ తో సెల్ఫీ తీసుకున్నారు. అక్కడితో ఆగకుండా దీన్ని ట్విటర్ లో పెట్టారు. ఇది సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. కరువు ప్రాంతంలో సెల్ఫీ తీసుకుంటారా అంటూ మంత్రిపై నెటిజన్లు మండిపడ్డారు.
వెంటనే స్పందించిన ఆమె పనుల పర్యవేక్షణకు సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేసి నెటిజన్లను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. మంజీరా నది పునరుద్ధరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పే ప్రయత్నం చేశారు. పంకజ సెల్ఫీపై మిత్రపక్షం శివసేన స్పందించింది. కరువు ప్రాంతం లాతూరులో సెల్ఫీ తీసుకోవడం దురదృష్టకరమని, ఇలా చేసుండాల్సింది కాదని వ్యాఖ్యానించింది. కరువును బీజేపీ వెక్కిరిస్తోందని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. బీజేపీ మొత్తం సెల్ఫీ, అవకాశవాద పార్టీ అని విమర్శించింది.