ఖతర్నాక్ ప్లాన్.. అట్టర్ ప్లాప్!
సూరత్: కారు ఇన్సూరెన్స్ డబ్బు కొట్టేయాలని ఖతర్నాక్ ప్లాన్ చేసిన అడ్డంగా బుక్కయ్యాడో మాయగాడు. బీమా సొమ్మును అక్రమంగా బొక్కేందుకు కుట్రను పోలీసులు ఛేదించారు. గుజరాత్ లోని సర్తనా ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు బుధవారం కారును తగలబెట్టరారు. మంటల్లో దగ్ధమైన కారుపై పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి(పాస్) కన్వీనర్ హార్ధిక్ పటేల్ బొమ్మతో పాటు, పటేల్ రిజర్వేషన్ల పోరాటంలో మృతి చెందిన వారి ఫొటోలు ఉన్నాయి.
పోలీసుల దర్యాప్తులో ఆశ్చర్యకర విషయాలు వెల్లడైయ్యాయి. కారు యజమాని దినేశ్ చొరాదియా మరో ఇద్దరితో కలిసి ఈ దురాగతానికి పాల్పడినట్టు గుర్తించారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తన కారుకి తానే నిప్పుపెట్టాడు. దీనికి ముందు కారులోని విలువైన సామాన్లు తీసేసి.. కారుకు హార్ధిక్ పటేల్, ఇతరుల బొమ్మలు అతికించాడు. ఈ కారును దినేశ్ కు 2015లో పాస్ బహుమానంగా ఇచ్చింది. దినేశ్ కు సహకరించిన భవేశ్ దంగర్, నితిన్ దంగర్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న దినేశ్ పట్టుబడితే మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు అన్నారు.