11సార్లు కాల్చి చంపారు
కార్బెట్: ఉత్తరాఖండ్ లోని కార్బెట్ రిజర్వ్ అడవుల సమీప గ్రామస్ధులకు వణుకు పుట్టిస్తున్నఓ పులిని గురువారం అటవీ శాఖ అధికారులు కాల్చి చంపారు. గత కొద్ది వారాలుగా అటవీ సమీప గ్రామ ప్రజలపై దాడులు చేసిన ఆడపులి ఇద్దరిని చంపి తింది. దీంతో అప్రమత్తమైన అధికారులు దాన్ని చంపేందుకు 45 రోజులుగా విఫలయత్నాలు చేశారు.
పులి దాడులు చేయడం మొదలుపెట్టిన నాటి నుంచి అటవీ సమీప గ్రామాలకు యాత్రికుల సంఖ్య తగ్గింది. దీంతోపాటు గ్రామంలోని పిల్లలు పాఠశాలకు వెళ్లడం మానేశారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఆడపులిని పట్టుకునేందుకు మరో మారు అధికారులు, గ్రామస్ధులు యత్నించారు. తప్పించుకు పారిపోతున్న పులి జాడను గుర్తించేందుకు కుక్కలు, ఏనుగులు, డ్రోన్లు, హెలికాప్టర్లను కూడా అటవీ శాఖ అధికారులు ఉపయోగించారు.
రామ్ నగర్ అటవీ ప్రాంతంలో పులి జాడను గుర్తించిన అధికారులు చీకట్లో దానిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. గురువారం ఉదయం పులి జాడ కోసం వెతుకుతున్న సమయంలో 11 బుల్లెట్ గాయాలతో మరణించిన శవాన్ని అధికారులు గుర్తించారు. కాగా ఆడపులిని హతమార్చేందుకు దాదాపు ఒక కోటి రూపాయలు ఖర్చైనట్లు తెలిసింది. గురువారం పులి మృతదేహంతో గ్రామస్ధులు సుమారు మూడు గంటల పాటు ఊరేగింపు నిర్వహించారు.