ఫ్రాన్స్‌తో కలసి అంగారకుడి పైకి..
న్యూఢిల్లీ: అతి తక్కువ వ్యయంతో అంగారకుడి వద్దకు ఉపగ్రహాన్ని పంపి రికార్డు సృష్టించిన ఇస్రో.. మరిన్ని అద్భుతమైన ప్రాజెక్టులకు రంగం సిద్ధం చేస్తోంది. ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థతో కలసి అంగారకుడితోపాటు శుక్రగ్రహంపైకి ల్యాండర్‌లను పంపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీ (ఎఫ్‌ఎస్‌ఏ) చీఫ్ జీన్‌వైవ్స్ లేగాల్ ఆదివారం ఢిల్లీలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇస్రో చేసిన మంగళ్‌యాన్ ప్రయోగం ఎంతో అద్భుతమని, అతి తక్కువ వ్యయంతో దానిని విజయవంతం చేయడంలో ఇక్కడి శాస్త్రవేత్తల కృషి ప్రశంసనీయమని ఆయన చెప్పారు.
తమ వద్ద అంగారకుడితోపాటు శుక్రగ్రహంపై విస్తృత పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు ఉన్నారని.. మరోవైపు ఇస్రో కూడా పరిశోధనలు ముమ్మరం చేసిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అంగారకుడిపై పరిశోధనలో ఇస్రోతో కలసి పనిచేయనున్నామని, ఈ మేరకు సహకార ఒప్పందంపై సంతకాలు కూడా చేశామని తెలిపారు. అరుణగ్రహంపైకి ఇస్రో పంపనున్న తర్వాతి ఉపగ్రహ ప్రయోగంలో తమ పాత్ర కూడా ఉంటుందన్నారు. అంగారకుడితోపాటు శుక్రుడిపైకి కూడా ల్యాండర్ల (రోవర్ల)ను పంపే దిశగా కూడా ఇస్రోతో కలసి పనిచేస్తామని లేగాల్ తెలిపారు.