శ్రీనగర్: తనను కూడా పోలీసులు నిర్బంధించారని జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తి కుమార్తె ఇల్తిజా జావేద్ ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఇంటి నుంచి బయటకు రాకుండా శ్రీనగర్ పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర పునర్విభజన నాటి నుంచి మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తి, ఒమర్ అబ్దుల్లాలను గృహ నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన తల్లి ముఫ్తి తరఫున సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న ఇల్తిజా.. గురువారం తనను కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తాతయ్య సమాధి చూసేందుకు వెళ్తానంటే అనుమతి ఇవ్వడం లేదని వాపోయారు.(చదవండి: మీ అమ్మను కలవొచ్చు..కానీ)
అదేమైనా నేరమా?
‘నన్ను ఎక్కడికీ వెళ్లనివ్వడం లేదు. ఇంట్లోనే బంధించారు. మా తాతయ్య నాలుగో వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించాలనుకున్నాను. ఇందుకోసం నా వ్యక్తిగత సిబ్బంది, డ్రైవర్‌ను పంపించి అనుమతి ఇవ్వాల్సిందిగా సంబంధిత అధికారులను కోరాను. కానీ వారు అందుకు నిరాకరించారు. ఒక మనవరాలు.. తన తాతయ్య సమాధి వద్దకు వెళ్లడం నేరమా? లేదంటే నేను అక్కడికి వెళ్లి రాళ్లు రువ్వే నిరసన కార్యక్రమాలు చేపడతానని పోలీసులు భయపడుతున్నారా’ అని ఇల్తిజా ప్రశ్నించారు. లోయలో ప్రశాంత వాతావరణం చెడగొట్టేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు.(‘మా అమ్మను హరి నివాస్‌లో బంధించారు’)
కాగా మెహబూబా ముఫ్తి తండ్రి ముఫ్తి మహ్మద్ సయీద్ సమాధి అనంతనాగ్ జిల్లాలో ఉంది. ఇది ఇల్తిజా నివాసానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే భద్రతా కారణాల వల్లే ఇల్తిజాను పోలీసులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. కానీ పోలీసులు మాత్రం ఈ వార్తలను ఖండించారు. ఇల్తిజా ఎస్‌ఎస్‌జీ ప్రొటెక్షన్‌లో ఉన్నారని.. కాబట్టి తాను ఎక్కడికి వెళ్లాలన్నా పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే అనంతనాగ్ జిల్లా పాలనా విభాగం తనకు అనుమతి తిరస్కరించిన విషయం తమకు తెలియదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment