
సాక్షి, న్యూఢిల్లీ : పీఎన్‌బీ స్కామ్‌లో ప్రధాన నిందితుల్లో ఒకరైన డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీ తాను భారత్ నుంచి పారిపోలేదని, వైద్య చికిత్స కోసమే విదేశాలకు వెళ్లానని బొంబాయి హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తాను ఏయే వ్యాధులతో బాధపడుతున్నదీ ఈ అఫిడవిట్‌లో ఆయన పొందుపరిచారు. తనపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు సంస్ధల విచారణకు హాజరయ్యేందుకు అనారోగ్య కారణాలను చూపుతూ ఆయన తాను భారత్‌కు ప్రయాణించలేనని చెబుతున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం తాను నివసిస్తున్న అంటిగ్వాలోనే దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ తనను ప్రశ్నించాలని ఆయన కోరుతున్నారు. తాను చెబుతున్నది సరైనదేనని భావిస్తే విచారణ అధికారిని అంటిగ్వా వెళ్లి తనను విచారించాల్సిందిగా ఆదేశించాలని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో చోక్సీ కోరారు. కాగా రూ 13,400 కోట్ల పీఎన్‌బీ రుణ కుంభకోణంలో నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలను భారత్ రప్పించేందుకు ఈడీ, సీబీఐలు ప్రయత్నిస్తున్నారు. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు నకిలీ పత్రాలతో భారత బ్యాంకుల నుంచి రూ వేల కోట్ల రుణాలను పొంది తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. పీఎన్‌బీ కుంభకోణం వెలుగుచూసినప్పటి నుంచీ మోదీ, చోక్సీలు దేశాన్ని దాటి విదేశాల్లో తలదాచుకుంటున్నారు.