హవాలా డీలర్ అస్లాం వనీ అరెస్టు
న్యూఢిల్లీ: కశ్మీర్ వేర్పాటువాది షబీర్‌షాపై మనీ ల్యాండరింగ్ కేసులో హవాలా డీలర్ మహమ్మద్ అస్లాం వనీ(36)ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదివారం శ్రీనగర్‌లో అరెస్టు చేసింది. అస్లాం విచారణకు సహకరించడంలేదంటూ ఈడీ విన్నవించిన నేపథ్యంలో ఢిల్లీ కోర్టు అతడిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అరెస్టు చేసి, ఢిల్లీ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు అతన్ని హాజరుపర్చారు.
ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రధాన నిందితుడు షబీర్‌షాతో కలిపి అస్లాంను విచారించాల్సి ఉందని ఈడీ విన్నవించింది. ఈ మేరకు ఈ నెల 14 వరకు అస్లాంను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ మేజిస్ట్రేట్ ఆదేశాలిచ్చినట్టు దర్యాప్తు సంస్థ అధికారి ఒకరు తెలిపారు. 2005 కేసులో షాకు రూ.2.25 కోట్లు చేరవేసినందుకు అస్లాంను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 2010లో ఢిల్లీ కోర్టు... అతడిపైనున్న ఉగ్రవాదులకు నిధుల సరఫరా ఆరోపణలను కొట్టివేసింది. అయితే ఆయుధాల చట్టం కింద శిక్ష విధించింది.