పోలీసునని మోడల్ని సర్వం దోచాడు
ముంబయి: ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో పనిచేసే వ్యక్తి మాయమాటలు నమ్మి ఓ మోడల్ మోసపోయింది. నమ్మి అతడి వద్దకు వెళితే ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా డబ్బు బంగారం దోచుకున్నాడు. మరో లక్ష రూపాయలు కూడా చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఈ విషయం ఎవరితోనైనా చెబితే తాను తీసిన ఫొటోలు, వీడియోలు బయటపెడతానని అన్నాడు. చివరకు పోలీసుల చేతికి చిక్కాడు. పూర్తి వివరాల్లోకి వెళితే ఎంబీఏ పూర్తి చేసిన సుదీప్ బిశ్వాల్ అనే యువకుడు ముంబయిలో ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో పనిచేస్తున్నాడు.
తాను ఓ మంచి మోడల్ కోసం వెతుకుతున్నానని, ఇంటర్వ్యూకు రావాలని ఒక మోడల్ కు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆమె అతడి వద్దకు వెళ్లగానే వణికిపోయేలా చేశాడు. తాను ఒక పోలీసు అధికారినని పరిచయం చేసుకున్నాడు. 'మోడల్ ముసుగులో ఉన్న నువ్వు చాలా కాలంగా వ్యభిచారం చేస్తున్నావని నా వద్ద సమాచారం ఉంది. మంచితనంగా నేను చెప్పింది చేయ్. నీ దగ్గరున్న డబ్బు నగలు నాకు ఇచ్చేయ్' అని అన్ని తీసుకోవడంతోపాటు ఆ మోడల్ తో అభ్యంతరకరంగా ప్రవర్తించాడు.
బలవంతంగా ఆమె అభ్యంతరకర ఫొటోలు తీశాడు. అనంతరం ఆమెకు అంతకు ముందు ఓ నటితో ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు లక్ష చెల్లించాలని, లేదంటే కటకటాలపాలు చేస్తానని హెచ్చరించాడు. దీంతో బాధితురాలు గత ఏప్రిల్ నెలలో అతడికి తన వద్ద ఉన్నవన్ని ఇచ్చేసింది. ఆ తర్వాత కూడా అతడు వేధించడం మొదలుపెట్టడంతో ఈ విషయం పోలీసులకు చేరవేయగా ట్రాప్ చేసి అతడిని చివరకు అరెస్టు చేశారు.