'నా పేరు మోయినాల్.. నేను భారతీయుడినే'
కోల్కతా: తాను భారతీయుడినే అని నిరూపించుకునేందుకు ఓ వ్యక్తి నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ క్రమంలో జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. తన తరుపున ఉన్న న్యాయవాది మధ్యలో మోసం చేసి వెళ్లిపోవడంతో దాదాపు జీవితాంతం జైలులోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఓ స్వచ్ఛంద సంస్థ జోక్యం చేసుకోవడంతో అతడికి తిరిగి విముక్తి కలిగింది. సుప్రీంకోర్టు జోక్యంతో తిరిగి తాను భారతీయుడినే అని నిరూపించుకునే అవకాశం వచ్చింది. ఇది మోయిన్ మొల్లా అనే ఓ వ్యక్తి కథ. మోయినాల్ అనే వ్యక్తి నిరక్షరాస్యుడు. వీరిది బెంగాల్ కు చెందిన ముస్లిం కుటుంబం. బార్పెట్టా ప్రాంతంలో ఉంటున్నారు.
1998లో ఇల్లీగల్ మైగ్రాంట్ టిటర్మినేషన్ ట్రిబ్యునల్స్ లో అక్రమ వలసలకు సంబంధించి మూడు కేసులు నమోదయ్యాయి. ఇందులో మోయినాల్ ను కూడా చేర్చారు. దీంతో అతడు కూడా ఫారినర్స్ ట్రిబ్యునల్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. అయితే, అతడి తల్లిదండ్రులకు భారత పౌరసత్వం ఉందని, ట్రిబ్యునల్ ముందు హాజరుకావాల్సిన పనిలేదని అంతకుముందు ఉన్న ఓ లాయర్ అతడితో చెప్పడంతో ఎన్నోమార్లు ట్రిబ్యునల్ వద్దకు వెళ్లే వెనుదిరిగాడు. ఆ తర్వాత ట్రిబ్యునల్ వైపు వెళ్లలేదు. దీంతో అతడిని ఫిబ్రవరి 16, 2010లో ఓ పారినర్ గా ట్రిబ్యునల్ గుర్తించింది.
అప్పుడు అసలు విషయం తెలుసుకున్న మోయినాల్ వెంటనే తన తరుపున న్యాయవాదిపై కేసు వేశాడు. అయినా హైకోర్టు ఆ పిటిషన్ ను కొట్టి వేయడంతోపాటు అతడిని అదుపులోకి తీసుకోవాలని చెప్పింది. దీంతో పోలీసులు అరెస్టు చేసి గోల్పారాలోని డిటెన్షన్ క్యాంపులో పడేశారు. వాస్తవానికి మోయినాల్ పూర్వీకులు భారతీయ పౌరసత్వం ఉన్నవారే. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి వారి కుటుంబీకులు ఇక్కడ ఓటు కూడా వేస్తున్నారు. అంతేకాదు.. స్వాతంత్ర్యానికి పూర్వమే వారి పేరిట భూముల కొనుగోళ్ల పత్రాలు కూడా ఉన్నాయి. అయితే, అతడు నిరక్షరాస్యుడు అవడం మూలంగా వాటన్నింటిని చూపించలేకపోయాడు. తప్పుడు సలహా విని ట్రిబ్యునల్ ముందుకు వెళ్లి ఆధారాలు సమర్పించలేకపోయాడు. ఫలితంగా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.
ఈ విషయం తెలుసుకున్న ఓ స్వచ్ఛంద సంస్థ అతడికి సంబంధించిన అన్ని ఆధారాలు సేకరించడంతోపాటు.. చుట్టుపక్కలవారి నుంచి విరాళాలు వసూలు చేసి అతడి తరుపున సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ఈ పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు నాలుగు వారాల్లో ఫారినర్స్ ట్రిబ్యునల్ ముందుకు వెళ్లి తన పౌరసత్వాన్ని నిరూపించుకోవచ్చని చెప్పడంతో ఇక మోయినాల్ సంకెళ్లు తెగినట్లయింది. ఇలా ఎంతో మంది నిరక్షరాస్యులు తమ టెక్నికల్ సపోర్ట్ లేకుండా అనవసరంగా జైలుపాలు అవ్వుతున్నారని మోయిన్ తరుపు న్యాయవాది, స్వచ్ఛంద సంస్థ పేర్కొన్నాయి. అంతకుముందు మైగ్రాంట్స్ గా గుర్తించి భారతీయ సభ్యత్వం ఇచ్చిన ఇల్లీగల్ మైగ్రాంట్ టిటర్మినేషన్ ట్రిబ్యునల్స్(ఐఎండీటీ)ని రద్దు చేయడమే మోయినాల్ సమస్యకు ప్రధాన కారణంగా నిలిచింది.