టోర్పెడో నౌక ప్రమాద బాధిత కుటుంబాలకు నేవీ చీఫ్ పరామర్శ
విశాఖపట్నం: ఫిట్‌నెస్ లేకపోవడమే టోర్పెడో రికవరీ వెసల్ 72 నౌక మునిగిపోవడానికి కారణమనడం సరికాదని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. కె.థావన్ అన్నారు. ప్రమాద ఘటనలో అసువులు బాసిన నావికుడు జాకబ్, జాడ తెలియకుండా పోయిన లెఫ్టినెంట్ కమాండర్ .సుశీల్‌కుమార్ కుటుంబాలతో పాటు మరో ముగ్గురి కుటుంబాలను థావన్ ఆదివారం పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... నౌకకు ఫిట్‌నెస్ సమస్య ఉంటే తూర్పు నావికా దళ చీఫ్ అనుమతి ఇవ్వరని వివరించారు. దుర్ఘటనకు దారి తీసిన కారణాలపై బోర్డు కమిటీ వేశామని, వాస్తవాలు అందులో తెలుస్తాయన్నారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుని పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు.
విదేశీ పర్యటనలో ఉన్న ధావన్ ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే ఆదివారం హూటాహుటిన విశాఖ చేరుకున్నారు. విశాఖలోని ఈస్ట్‌పాయింట్ కాలనీలో నివాసముంటున్న లెఫ్టినెంట్ కమాండర్ వై.సుశీల్‌కుమార్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఎంవీపీ కాలనీలోని నివాసముంటున్న మృతుడు జాకబ్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్చారు. ఆయనతో పాటు ఈఎన్‌సీ చీఫ్ వైస్ అడ్మిరల్ సతీష్ సోనీతో పాటు పలువురు నావికా దళ ఉన్నతాధికారులున్నారు. పలువురు నేవీ వైవ్స్ వెల్ఫేర్ సంఘం ప్రతినిధులు కూడా బాధిత కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు.