గల్లంతైంది ఎందరు...ఏమయ్యారు!? | How many were displaced? | Sakshi
Sakshi News home page

గల్లంతైంది ఎందరు...ఏమయ్యారు!?

Published Mon, Nov 10 2014 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 4:09 PM

మునిగిపోవడానికి ముందు ప్రయోగించిన టార్పెడోను  తిరిగి సమీకరిస్తున్న టార్పెడో రికవరీ వెహికల్-72

మునిగిపోవడానికి ముందు ప్రయోగించిన టార్పెడోను తిరిగి సమీకరిస్తున్న టార్పెడో రికవరీ వెహికల్-72

     నౌకలో ఉన్నది 28 మంది కంటే ఎక్కువేనా?
     జాడలేనివారి సంఖ్యను తప్పుగా చూపుతున్నారా?
     ‘టీఆర్‌వీ-72’ మునకఘటనపై గోప్యత పాటిస్తున్న నౌకాదళ అధికారులు
     నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించిన కొందరు!

  సాక్షి, విశాఖపట్నం: ‘నవంబర్ 6, గురువారం..సాయంత్రం 6.30 నిమిషాలు.. తూర్పు నౌకాదళానికి చెందిన టోర్పెడో రికవరీ వెహికల్(టీఆర్‌వీ)-72 నౌక  ఇంజిన్‌లోకి నీరు రావడం మొదలైంది. క్రమంగా నౌక అంతటా వ్యాపించి ముంచేసింది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా నలుగురు సిబ్బంది గల్లంతయ్యారు.’-నాలుగు రోజుల క్రితం నౌకాదళ అధికారులు చెప్పిన మాటలు ఇవి. ఆ తర్వాత వారి నుంచి ఒక్క ప్రకటన కూడా విడుదల కాలేదు. గల్లంతైన వారు ఏమయ్యారో చెప్పడం లేదు. అత్యంత గోప్యత పాటిస్తున్నారు. ఏ చిన్న సమాచారం బయటకు పొక్కినా సహించమంటూ సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశారు. కాగా,  గల్లంతయిన వారు అసలు ఎందరు అనే అనుమానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఘటనపై ‘సాక్షి’కి లభించిన విశ్వసనీయ సమాచారం ఇలా ఉంది...


 ఆ రాత్రి ఏం జరిగింది?
 యుద్ధ నౌకల నుంచి ప్రయోగాత్మకంగా పేల్చిన టోర్పెడోలను తిరిగి సేకరించడానికి టోర్పెడో రికవరీ వెహికల్(టీఆర్‌వీ)-72ను ఉపయోగిస్తుంటారు. ఆ రోజు కూడా అదే చేశారు. తొలుత ఒక టోర్బెడోనూ విజయవంతంగా ప్రయోగించి వెనక్కు తీసుకువచ్చారు. రెండో టోర్పెడోను ప్రయోగించిన తర్వాత దానికి సేకరించేందుకు టీఆర్‌వీ-72 ప్రయత్నించింది. ఆ సమయంలో నేవీ సిబ్బంది డాక్‌పైనే ఉన్నారు.అకస్మాత్తుగా డాక్‌పైకి సముద్రం నీరు వచ్చేసింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే నౌక మునగడం ప్రారంభించింది. కేవలం 30 సెకన్లలో నౌక అంతటా నీరు చేరింది. ఈ హఠాత్ పరిణామానికి నిశ్చేష్టులైన సిబ్బంది ప్రాణాలు రక్షించుకోవడానికి పరుగులు తీశారు. అందుబాటులో ఉన్న చిన్న బోట్లలో ఎక్కి కొందరు తప్పించుకున్నారు.

మరి కొందరు లైఫ్ జాకెట్ల వేసుకుని ధైర్యం చేసి సముద్రంలో దూకేశారు. అలా దూకిన వారు చిమ్మ చీకట్లో, నడిసముద్రంలో దాదాపు గంటన్నరపాటు నరకం చూశారు. బతుకుతామో లేదో తెలియక, మృత్యువు కోరల్లో ఆయువు కోసం పోరాడారు. మునిగిపోయిన నౌక ఉన్న ప్రాంతం నుంచి అతి కష్టం మీద ఈదుకుంటూ వెళుతుండగా ఓ విద్యుత్ లైట్ కనిపించింది. దగ్గరకు వెళ్లగా అది ఓ నౌకగా తెలిసింది. వెంటనే రక్షించమని కేకలు వేస్తూ, ఆ నౌకలోని సిబ్బంది సాయంతో బతికి బయటపడ్డారు. అక్కడి నుంచి ఒడ్డుకు చేరుకుని నేవీ కార్యాలయంలో ఉన్నతాధికారులకు జరిగిన ప్రమాదం గురించి చెప్పారు. వారు వెంటనే నౌకలను,హెలికాప్టర్లను సంఘటన స్థలానికి పంపించారు.


 నౌకలో ఎంతమంది ఉన్నారు?
 సాధారణంగా ప్రతి నౌకలోనూ కెప్టెన్, ఎగ్జిక్యూటివ్ నావిగేషన్, ఇంజన్, నావిగేటింగ్, వెపన్స్, ఎలక్ట్రికల్, కుకింగ్, క్లీనింగ్ సిబ్బంది ఉంటారు. టీఆర్‌వీ-72లోనూ వీరందరి అవసరం తప్పనిసరి. అయితే నేవీ అధికారులు 28 మంది సిబ్బంది ఉన్నారని చెబుతున్నారు. కానీ ఆ సంఖ్య 30-35 మధ్య ఉంటుందని తెలిసింది. వారిలో నిజంగా గల్లంతైన వారెందరనేది తేలాల్సి ఉంది.


 ఆ ఆరుగురు వ్యక్తులు ఎవరు?
 టీఆర్‌వీ-72లో నేవీ సిబ్బందితో పాటు బయటి వ్యక్తులు కూడా ఉన్నట్లు సమాచారం. నిజానికి రక్షణ శాఖ నౌకలోకి ఇతరులను అనుమతించడం నిబంధనలకు విరుద్ధం. కానీ ఆరుగురు బయటి వ్యక్తులు ఆ రోజు నౌకలో ప్రయాణించినట్లు సమాచారం. వారంతా ఓ ప్రభుత్వ సంస్థకు చెందిన సిబ్బందిగా తెలిసింది. సబ్‌మెరైన్లు, నౌకలను విచ్ఛిన్నం చేసే టోర్పెడో(ఆయుధం)ను ఎన్‌ఎస్‌టీఎల్ తయారు చేస్తోంది. ఆ సంస్థ తయారు చేసిన టార్పెడోకు ఉండే మోటార్ల పనితీరును వీరు పరీక్షిస్తుంటారు. అయితే అది  నౌక సముద్రంలోకి వెళ్లక ముందే జరుగుతుంది. కానీ నేవీ అధికారులకు, వారి సంస్థకు పరస్పర అవగాహన ఉండటంతో నిబంధనలను తోసిపుచ్చి వారిని నౌకలోకి అనుమతించినట్లు సమాచారం.

అదృష్ట వశాత్తూ వారందరూ క్షేమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయాలన్నీ బయటకు తెలిస్తే ఉద్యోగాలు పోతాయని భయపడి ఎవరికి వారు గోప్యత పాటిస్తున్నారు. అయితే ఉన్నతాధికారులకు మాత్రం సమగ్ర సమాచారాన్ని అందజేయకతప్పలేదు. ఈ నేపధ్యంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని విశాఖ నేవీ అధికారులు కలవరపడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement