న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా అరెస్టుకు ప్రతీకారంగా భద్రతా బలగాలపై మావోయిస్టులు ఏక్షణంలోనైనా విరుచుకుపడే ప్రమాదం పొంచి ఉందని కేంద్ర హోం శాఖ మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలను హెచ్చరించింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణల నేపథ్యంలో సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సాయిబాబా అరెస్టుకు ప్రతీకారంగా భద్రతా బలగాలపై దాడులు చేయాలంటూ నక్సల్స్ నేతలు తమ కేడర్‌కు సూచించారని, ఈ క్రమంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పరిస్థితినైనా ఎదిరించేందుకు సిద్ధంగా ఉండాలని హోం శాఖ కోరింది.
సాయిబాబా మావోయిస్టు అగ్రనేత కాదని పేర్కొంటూనే దండకారణ్యం ప్రాంతంలో ప్రతీకార దాడులు చేయాలంటూ సీపీఐ(మావోయిస్టు) పార్టీ ఇప్పటికే ఆదేశించిన విషయాన్ని హోంశాఖ ఈ సందర్భంగా రాష్ట్రాలకు వివరించింది. అదేవిధంగా సాయిబాబా విడుదలకు డిమాండ్ చేస్తూ నక్సల్స్ సానుభూతి పరులు, ఉద్యమకారులు, విద్యావేత్తలు ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టాలని సైతం మావోయిస్టులు పిలుపునిచ్చిన విషయాన్ని హోంశాఖ పేర్కొంది. రానున్న కొన్ని వారాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న రాష్ట్రాల్లో ఐఈడీ దాడులు జరిగే అవకాశం ఉందని ఈ విషయంలో ఆయా ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని హోంశాఖ సూచించింది. ఈ మేరకు గురువారం ఆయా రాష్ట్రాలకు హోంశాఖ హెచ్చరికలు జారీచేసింది. ఇదిలావుంటే, ప్రొఫెసర్ సాయిబాబాను ఢిల్లీ వర్సిటీ విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు గురువారం వర్సిటీ వీసీ సస్పెండ్ ఉత్తర్వులను వెలువరించారు.
నక్సల్స్ ప్రతీకార దాడులు చేయొచ్చు!
Published Fri, May 16 2014 1:06 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
Advertisement
Advertisement