G N Saibaba
-
సీసీటీవీ కెమెరాలు తీసేయకుంటే జైల్లో నిరాహార దీక్ష: సాయిబాబా
నాగపూర్: జైలులో తాను కాలకృత్యాలు తీర్చుకొనేచోట, స్నానం చేసే చోట అధికారులు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారని, వాటిని వెంటనే తొలగించాలని ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా డిమాండ్ చేశారు. లేదంటే జైలులో నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. మావోయిస్టులతో సంబంధాల కేసులో ఆయన ప్రస్తుతం మహారాష్ట్రలోని నాగపూర్ జైలులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. అతని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. అధికారులు అతనికి వాటర్ బాటిల్ ఇవ్వడానికి నిరాకరించారని ఆరోపించారు. జైలు అధికారులు ఉద్దేశపూర్వకంగా సాయిబాబా మంచం పక్కన స్టీల్ బాటిల్‌ను ఉంచారని, అతని ఆరోగ్య పరిస్థితి కారణంగా బాటల్‌ను ఎత్తలేడని, దీని ఫలితంగా తీవ్రమైన వేడిలో తరచుగా నీరు త్రాగడానికి అతని వద్ద బాటిల్ లేదని వారు పేర్కొన్నారు. -
సెంట్రల్ జైలులో కరోనా కలకలం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మొదలైన వ్యాక్సినేషన్ ప్రక్రియతో కరోనా మహమ్మారినుంచి దేశం కోలుకుంటున్న తరుణంలో నాగపూర్ సెంట్రల్ జైలులో మరోసారి కరోనా కలకలం రేగింది. మానవ హక్కుల కార్యకర్త, ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా సహా మరో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. సాయిబాబాకు శుక్రవారం కరోనా పాజిటివ్ నిర్థారణ అయిందనీ, సిటీ స్కాన్ ఇతర పరీక్షల కోసం తీసుకువెళ్ల నున్నామని సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ అనుప్ కుమార్ కుమ్రే తెలిపారు. అలాగే చికిత్స కోసం ఆయనను ప్రభుత్వ వైద్య కళాశాల లేదా ఆసుపత్రికి తరలించాలా అనేది వైద్యులు నిర్ణయిస్తారని చెప్పారు. దీంతో 90 శాతం అంగవైకల్యం, ఇప్పటికే జైలులో అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబా ఆరోగ్యంపై తీవ్ర అందోళన వ్యక్తమవుతోంది. ఇదే జైల్లో ఉంటున్న గ్యాంగ్‌స్టర్ అరుణ్ గావ్లీతోపాటు మరో అయిదుగురికి ఇటీవల కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. కాగా నిషేధిత మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై యుఏపీఏ చట్టం కింద ప్రొఫెసర్ సాయిబాబాకు నాగపూర్ హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆయనతోపాటు మరో నలుగురికి కూడా శిక్షపడింది. దీంతో 2017 మార్చి నుంచి సాయిబాబా నాగపూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే వికలాంగుడైన సాయిబాబాను మానవతా దృక్ఫథంతో విడిచిపెట్టాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
నక్సల్స్ ప్రతీకార దాడులు చేయొచ్చు!
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా అరెస్టుకు ప్రతీకారంగా భద్రతా బలగాలపై మావోయిస్టులు ఏక్షణంలోనైనా విరుచుకుపడే ప్రమాదం పొంచి ఉందని కేంద్ర హోం శాఖ మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలను హెచ్చరించింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణల నేపథ్యంలో సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సాయిబాబా అరెస్టుకు ప్రతీకారంగా భద్రతా బలగాలపై దాడులు చేయాలంటూ నక్సల్స్ నేతలు తమ కేడర్‌కు సూచించారని, ఈ క్రమంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పరిస్థితినైనా ఎదిరించేందుకు సిద్ధంగా ఉండాలని హోం శాఖ కోరింది. సాయిబాబా మావోయిస్టు అగ్రనేత కాదని పేర్కొంటూనే దండకారణ్యం ప్రాంతంలో ప్రతీకార దాడులు చేయాలంటూ సీపీఐ(మావోయిస్టు) పార్టీ ఇప్పటికే ఆదేశించిన విషయాన్ని హోంశాఖ ఈ సందర్భంగా రాష్ట్రాలకు వివరించింది. అదేవిధంగా సాయిబాబా విడుదలకు డిమాండ్ చేస్తూ నక్సల్స్ సానుభూతి పరులు, ఉద్యమకారులు, విద్యావేత్తలు ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టాలని సైతం మావోయిస్టులు పిలుపునిచ్చిన విషయాన్ని హోంశాఖ పేర్కొంది. రానున్న కొన్ని వారాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న రాష్ట్రాల్లో ఐఈడీ దాడులు జరిగే అవకాశం ఉందని ఈ విషయంలో ఆయా ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని హోంశాఖ సూచించింది. ఈ మేరకు గురువారం ఆయా రాష్ట్రాలకు హోంశాఖ హెచ్చరికలు జారీచేసింది. ఇదిలావుంటే, ప్రొఫెసర్ సాయిబాబాను ఢిల్లీ వర్సిటీ విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు గురువారం వర్సిటీ వీసీ సస్పెండ్ ఉత్తర్వులను వెలువరించారు. -
'మావోనేత గణపతితో లెక్చరర్ కు సంబంధాలున్నాయి'
రామ్ లాల్ ఆనంద్ కాలేజి లెక్చరర్ జీన్ సాయిబాబాకు నిషేధిత నక్సలైట్లతో సంబంధాలు కలిగి ఉన్నాడనే ఆరోపణలపై సాక్ష్యాలు సమర్పించేందుకు భద్రతా సంస్థలు ఢిల్లీ యూనివర్సిటీ వైఎస్ చాన్స్ లర్ కు నివేదిక ఇవ్వనున్నారు. సీపీఐ(మావోయిస్ట్) నాయకుడు, ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల గణపతి అలియాస్ గణపతితో ప్రత్యక్ష సంబంధాలు జరిపాడని నిఘా సంస్థలు సాక్ష్యాలను సేకరించినట్టు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. సాయిబాబా నివాసంలో ఢిల్లీ, మహారాష్ట్ర పోలీసులు సోదాలు జరిపి.. కొన్ని వ్యాసాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్, ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్, కొంత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీపీఐ (మావోయిస్ట్) పోలిట్ బ్యూరో సభ్యుడు కోబాడ్ గాంధీని విచారించగా.. సాయిబాబా పేరు బయటకు వచ్చిందని.. మావోయిస్ట్ పార్టీకి ఆల్ ఇండియా కోఆర్డినేటర్ గా సాయిబాబా వ్యవహరిస్తున్నారని పోలీసులు తెలిపారు.