
యదువీర్ గోపాలరాజ్ అర్స్
మైసూర్: రాణి ప్రమోదా దేవి వడయార్ మైసూరు రాజవంశానికి ఈ రోజు నూతన వారసుడిని అధికారికంగా ప్రకటించారు. అంబా విలాస్ ప్యాలెస్లో జరిగిన విలేకరుల సమావేశంలో రాజవంశ వారసునిగా యదువీర్ గోపాలరాజ్ అర్స్ పేరును ఆమె ప్రకటించారు. మైసూర్ సంస్థానం చివరి రాజైన శ్రీకంఠదత్త నరసింహరాజ వడయార్ 2013 డిసెంబరులో మరణించారు.ఆ తరువాత ఆయన స్థానంలో మరొకరిని నియమించలేదు. ఆయనకు సంతానం లేకపోవడంతో ఆ సంస్థానంలో కొనసాగే రాజు ఎవరనే విషయమై చాలా ఊహాగానాలు వినవచ్చాయి. ఈ రోజుతో వాటన్నిటికీ తెర పడింది.
యదువీర్ గోపాలరాజ్ అర్స్ నరసింహరాజ వడయార్ సోదరి గాయత్రీ దేవి మనుమడు. త్రిపుర సుందరీదేవి, స్వరూప గోపాలరాజ్ అర్స్ కుమారుడు. యదువీర్ 12వ తరగతి వరకు బెంగళూరులో చదువుకున్నాడు. ఆ తరువాత అతను అమెరికా వెళ్లారు. ప్రస్తుతం బూస్టన్లో బిఏ చదువుతున్నారు. యదువీర్ దత్తత స్వీకార కార్యక్రమం ఈ నెల 23న జరుగుతుంది. దత్తత స్వీకారం అనంతరం అతని పేరు యదువీర్ కృష్ణదత్త చామరాజ్ వడయార్గా మారుతుంది. అయితే పట్టాభిషేక మహోత్సవం ఎప్పుడు నిర్వహించేది ఇంకా ప్రకటించలేదు.
వడయార్ వంశస్తులు దాదాపుగా 550 ఏళ్లు (1399 నుంచి 1947) మైసూర్ సంస్థానాన్ని పరిపాలించారు. ఆ ప్రాంతాన్ని ఒకే రాజవంశం అత్యధిక కాలం పరిపాలించడం అదే ప్రథమం. వీరి పరిపాలన ఎంతో సుభిక్షంగా ఉండటంతో ఆ వంశస్తులంటే మైసూర్ ప్రజలకు ఎంతో గౌరవం. ఇప్పటికీ ఆ వంశస్తులను రాజులుగానే భావిస్తారు. 1940 నుంచి 1947 మధ్యకాలంలో మైసూర్‌ను పాలించిన జయ చమరాజేంద్ర వడయార్‌కు నరసింహరాజు ఒక్కగానొక్క కుమారడు. నరసింహరాజుకు ఐదుగురు సోదరీ మణులు ఉన్నారు. వారిలో ఒక సోదరి గాయవూతిదేవి మనుమడైన యదువీర్ గోపాలరాజ్ పేరుని నరసింహరాజు భార్య ప్రమోదాదేవి వారసుడిగా ప్రకటించారు.