
సీఏఏను అమలు చేయబోమని రాష్ట్రాలు చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
చెన్నై : పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ)వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానాలు చేయవచ్చని అయితే నూతన చట్టం అమలును అవి నిర్ణయించలేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. సీఏఏను అమలు చేయబోమని కొన్ని రాష్ట్రాలు తేల్చిచెప్పడం రాజ్యాంగ విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. చెన్నై సిటిజన్స్ ఫోరం సీఏఏపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొంటూ సీఏఏకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయవచ్చని, దాన్ని రాజకీయ ప్రకటనగా తాము అర్ధం చేసుకోగలమని అన్నారు.
వారు ఇంకా ముందుకెళ్లి ఆ చట్టాన్ని తాము అమలు చేయబోమని చెప్పడం సరైంది కాదని, అది చట్ట విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. పార్లమెంట్‌లో ఆమోదించిన చట్ట అమలుకు పూనుకోవడం రాష్ట్రాల బాధ్యతని చెప్పారు. కాగా ఈ చట్టానికి వ్యతిరేకంగా ఇప్పటికే కేరళ, పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీలు తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు రాజస్ధాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలు సైతం సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌ఆర్‌పీలకు వ్యతిరేకంగా గళమెత్తాయి.