'రాహుల్.. ఆ హత్యతో మాకు సంబంధం లేదు'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య విషయంలో తమకుగానీ, తమకు చెందిన ఏ సంస్థకుగానీ ఎలాంటి సంబంధం లేదన్నారు. బెంగళూరులోని తన నివాసం వద్ద ప్రముఖ జర్నలిస్టు అయిన గౌరీ లంకేష్ దారుణ హత్యకు గురై చనిపోయిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన రాహుల్ మాట్లాడుతూ బీజేపీకి, ఆరెస్సెస్‌కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిపై దాడులు జరుగుతాయని, హత్యలు కూడా చేస్తారని ఆరోపించారు.
భారత్‌కు విరుద్దమైన భావజాలాన్నే వారు రుద్దాలని అనుకుంటారని, దానిని ఎవరు వ్యతిరేకించినా ఒప్పుకోరన్నారు. దీనిపై నితిన్ గడ్కరీ స్పందిస్తూ.. 'రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలు అవాస్తవాలు, నిరాధారాలు. గౌరీ లంకేష్ ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదు. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం, మా సంస్థలకు ఎలాంటి సంబంధం లేదు. మేం దీనిని ఖండిస్తున్నాం' అని ఆయన అన్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా రాహుల్ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. ప్రధాని అంటే ఏదో ఒక పార్టీకి చెందిన వ్యక్తికాదు. ఆయన దేశానికి ప్రధాని' అని గడ్కరీ చెప్పారు.