Gauri Lankesh Murder
-
2017 పరువు నష్టం కేసులో బాంబే హైకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ
ముంబై: ప్రముఖ సామాజికవేత్త, సీనియర్ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్యకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంస్థకు(ఆర్ఎస్ఎస్కు) సంబంధం ఉందంటూ చేసిన వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బాంబే హైకోర్టు తలుపు తట్టారు. గౌరీ లంకేశ్ హత్య నేపథ్యంలో 2017లో తనపై దాఖలైన పరువు నష్టం కేసును కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఈ మేరకు 2019లో బోరివరి మేజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సీపీఐ కార్యదర్శి సీతారాం ఏచూరితోపాటు తనను తప్పుగా ఈ కేసులో నిందితుడిగా చేర్చారని తన పిటిషన్లో పేర్కొన్నారు. కాగా గౌరీ లంకేష్ హత్య తర్వాత సీతారాం ఏచూరి వేరే చోట, వేరే సమయంలో ప్రకటన చేశారనే విషయాన్ని ప్రస్తావించారు. కాగా, గౌరీ లంకేష్ 2017 సెప్టెంబర్ 5న బెంగళూరులోని తన ఇంటి ముందే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. మతపరమైన విమర్శలు చేస్తున్నారనే భావనతో గౌరీ లంకేష్‌ను హిందూ అతివాద భావజాలం ఉన్న కొందరు కాల్చి చంపారు. ఈ హత్యలు జరిగిన 24 గంటల్లోనే రాహుల్ పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడే వారెవరిపై ఒత్తిడి చేస్తారని, దాడులు జరిపి చంపేస్తారని ఆరోపించారు. మరోవైపు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తులే జర్నలిస్టును హత్య చేశారని ఏచూరి ఆరోపించారు. గౌరీ లంకేష్ హత్యను బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలంతో ముడిపెట్టారని ఆరోపిస్తూ ఆర్ఎస్ఎస్ కార్యకర్త, న్యాయవాది ధృతిమాన్ జోషి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, సీతారాం ఏచూరిపై ఐపీసీ సెక్షన్ 499, 500 ప్రకారం ఫిర్యాదు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా ప్రజల దృష్టిలో ఆర్ఎస్ఎస్ పరువును తగ్గించడమే అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా 2019 ఫిబ్రవరి 18న మజ్గావ్ జిల్లా కోర్టు గాంధీతోపాటు ఏచూరికి సమన్లు జారీ చేసింది. వీరిద్దరూ 2019 జూలై 4న కోర్టుకు హాజరై బెయిల్ కోసం ప్రయత్నించారు. మరుసటి రోజే సీతారాం ఏచూరి వేర్వేరు ప్రదేశాలు, సమయాల్లో చేసిన వ్యాఖ్యలని చెబుతూ, దీనిపైఉమ్మడి విచారణ జరగడం సరికాదని అన్నారు. తనపై నమోదైన ఫిర్యాదును కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే నవంబర్ 23, 2019న మేజిస్ట్రేట్ రాహుల్, ఏచూరీ పిటిషన్లను తోసిపుచ్చింది. వ్యక్తులు వేరైనా చేసిన ప్రకటనలు ఒకటేనని, నిందితుల ఉద్ధేశం ఆర్ఎస్ఎస్ను కించపరడమేనని కోర్టు పేర్కొంది. ఈ తీర్పును సవాల్ చేస్తూనే నేడు కాంగ్రెస్ నేత బాంబే హైకోర్టును ఆశ్రయించారు. -
భారత్ జోడో యాత్రలో పాల్గొన్న గౌరి లంకేశ్ తల్లి!
బెంగుళూరు: ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ గౌరి లంకేశ్ 2017లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ మేరకు గౌరి లంకేశ్ తల్లి ఇందిరా, చెల్లి కవిత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ శుక్రవారం జోడోయాత్రలో భాగంగా శుక్రవారం కర్ణాటక పర్యటిస్తున్నప్పుడూ దివగంత జర్నలిస్ట్ తల్లి, చెల్లి ఇద్దరు పాల్గొన్నారు. భారతదేశ నిజమైన స్ఫూర్తికి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరి లంకేశ్ లాంటి వాళ్ల కోసం నిలబడతానని రాహుల్ గాంధీ అన్నారు. వాస్తవానికి గౌరి లంకేశ్ సెప్టెంబర్ 5, 2017న రాజరాజేశ్వరి నగర్‌లోని తన ఇంటికి వస్తున్న సమయంలో మోటరు సైకిల్‌పై వచ్చిన కొందరు అగంతకులు ఆమెపై కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయారు. ఈ మేరకు రాహుల్‌గాంధీ ట్విట్టర్లో.... "గౌరి లంకేశ్ సత్యం, ధైర్యం, స్వాతంత్య్రం కోసం నిలబడింది. గౌరి లంకేశ్ లాగా భారతదేశ నిజమైన స్ఫూర్తికోసం ప్రాతినిథ్యం వహిస్తున్న లెక్కలేనంతమంది వ్యక్తుల కోసం నిలబడతాను. ఈ భారత జోడో యాత్ర వారి స్వరం. దీన్ని ఎప్పటికి నిశబ్దంగా ఉంచలేరు" అని రాహుల్ ట్విట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 3,750 కి.మీ భారత జోడో యాత్ర సెప్టంబర్ 8న కన్యాకుమారి నుంచి ప్రారంభమైంది. ఈ యాత్రలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విభజన రాజకీయాలను ఎదుర్కోవాలని కోరింది. గురువారం కర్ణాటకలో సాగుతున్న జోడోయాత్రలో సోనియా గాంధీ పాల్గొనడంతో పార్టీ శ్రేణుల్లో కొండంత నూతన ఉత్సాహం వచ్చింది. Gauri stood for Truth Gauri stood for Courage Gauri stood for Freedom I stand for Gauri Lankesh and countless others like her, who represent the true spirit of India. Bharat Jodo Yatra is their voice. It can never be silenced. pic.twitter.com/TIpMIu36nY — Rahul Gandhi (@RahulGandhi) October 7, 2022 (చదవండి: శివసేన మాదే.. ఎన్నికల గుర్తు వాళ్లదెలా అవుతుంది?) -
‘భారత్ మాతా కూడా మీటూ బాధితురాలే’
చెన్నై : చెన్నై లయోలా కాలేజీలో నిర్వహించిన ఓ ఆర్ట్ ఫెస్టివల్ వివాదాస్పదంగా మారింది. ఈ నెల 19, 20 తేదిల్లో కాలేజీలో ‘స్ట్రీట్ అవార్డ్ ఫెస్టివల్’ పేరుతో ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహించారు. ‘అక్మే బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు సంపాదించడం కోసం ఉద్దేశించిన ఈ ఫెస్టివల్ వివాదాస్పదంగా మారింది. ఇక్కడ ప్రదర్శించిన కొన్ని చిత్రాలు, వాటి క్యాప్షన్లు ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని కించపరిచేలా ఉండటమే ఇందుకు కారణం. ఇక్కడ ప్రదర్శించిన కొన్ని చిత్రాలకు ‘భారత్ మాతా కూడా మీటూ బాధితురాలే’, ‘రచయిత గౌరీ లంకేష్ హత్యతో ఆర్ఎస్ఎస్కు సంబంధం ఉంది’, ‘పీఎం మోదీ సామ్రాజ్యవాదాన్ని అనుసరిస్తారు’ అంటూ వివాదాస్పద క్యాప్షన్లు పెట్టారు. దాంతో ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమా ఆనంద్ అనే మహిళ మాట్లాడుతూ.. ‘‘స్ట్రీట్ అవార్డ్ ఫెస్టివల్’ అని చెప్పారు. కానీ ఇక్కడ పరిస్థితులు మరో రకంగా ఉన్నాయి. స్ట్రీట్ అవార్డ్స్ అంటే.. మన జాతీయ చిహ్నాలను.. దేశ ప్రధానిని అవమానించడమేనా’ అని ప్రశ్నించారు. మరో బీజేపీ కార్యకర్త మాట్లాడుతూ.. ‘లయోలా కాలేజీ కేంద్రం నుంచి నిధులు పొందుతుంది. కానీ ఇక్కడ లౌకిక భావనను పూర్తిగా దెబ్బ తీస్తున్నారు. జాతీ వ్యతిరేక, హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు అనుమతి ఇస్తున్నారం’టూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ‘ఒక వేళ కాలేజీ యాజమాన్యమే ఇలాంటి కార్యకలపాలను ప్రోత్సాహిస్తుందని తెలిస్తే.. కేంద్రం నుంచి కాలేజికి వచ్చే నిధులను నిలిపివేయాలంటూ ప్రభుత్వాన్ని కోరతామ’ని హెచ్చరించారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో కాలేజీ యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు దిగింది. కాలేజీ ప్రాంగణాన్ని తప్పుడు కార్యక్రమాల కోసం దుర్వినియోగం చేసినందుకు తాము ఎంతో బాధపడుతున్నామని.. క్షమించమని కోరింది. -
కట్టుకథలే రాజ్యమేలుతున్నాయి
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కడా ప్రజాస్వామిక వాతావరణం లేదని, అబద్ధాలు, కట్టుకథలతో రాజ్యమేలుతున్నారని ప్రముఖ సామాజిక కార్యకర్త అరుణారాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. రచయితలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తీకరించే పరిస్థితి లేదని, దళితులు, అణగారిన వర్గాలపై దాడులు పెరిగాయని చెప్పారు. బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో మూడు రోజుల పాటు జరిగిన హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ముగింపు ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రజలు తమ న్యాయమైన హక్కుల కోసం ఆందోళనకు దిగే అవకాశం లేకుండా పోయిందని ఆమె చెప్పారు. దళితులపై దాడులు కొనసాగుతున్నాయని, రోహిత్ వేముల ఆత్మహత్య ఇందులో భాగమేనన్నారు. బెంగళూర్‌లో గౌరీలంకేశ్‌ను చంపేశారని, తమిళనాడులో పెరుమాళ్ మురుగన్‌ను దాదాపుగా సామాజిక బహిష్కరణ చేశారని, ఇలాంటివి వెలుగులోకి వచ్చినప్పుడు వాటి చుట్టూ అనేక కట్టుకథలను ప్రచారం చేస్తూ అసలు నిజాలను మరుగున పడేస్తున్నారన్నా రు. సమానత్వం, ప్రజాస్వామిక హక్కుల కోసం జరిగే ఉద్యమాలను బలోపేతం చేయాలని, అలాంటి నిజమైన కథనాలకు మీడియా ప్రచారం కల్పించాలని కోరారు. గౌరీలంకేశ్‌ను చంపిందెవరో తెలుసు హత్యకు గురైన జర్నలిస్టు గౌరీలంకేశ్‌పై ఏర్పాటు చేసిన ప్రత్యేక సదస్సులో హైదరాబాద్ బుక్ ట్రస్టు అధ్యక్షులు గీతారామస్వామి, తమిళ రచయితలు పెరుమాళ్ మురుగన్, కణ్ణన్ సుందరం పాల్గొన్నారు. ‘గౌరీలంకేశ్‌ను ఎవరు హతమార్చారనే విషయంలో సందేహా ల్లేవు. గుజరాత్లో మారణహోమం సృష్టించిన పాలకులే ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతు న్న ప్రజాస్వామికవాదుల హత్యలకు కారకులు’ అని గీతారామస్వామి ఆరోపించారు. పెరుమాళ్ ‘పూనాచీ’ ఆవిష్కరణ.. తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ రాసిన ‘పూనాచీ’(మేక కథ) పుస్తకాన్ని లిటరరీ ఫెస్టివల్లో ఆవిష్కరించారు. మురుగన్ రాసి న ‘హాఫ్ విమెన్’ నేపథ్యంలో దాడులు జరగడంతో ‘మురుగన్ అనే రచయిత చనిపోయాడు’ అని ఆయన ప్రకటించారు. హైకోర్టు ఆయన రచనలు చేసేందుకు అనుమతివ్వడంతో పూనాచీని ఆవిష్కరించారు. కాగా లిటరరీ ఫెస్టివల్ ఆదివారంతో ముగిసింది. ఈ వేడుకల్లో సుమారు 10 వేల మంది పాల్గొన్నారు. ఈ ఏడాది అతిథి దేశంగా స్పెయిన్ హాజరైంది. భారతీయ భాషగా కన్నడపై విస్తృత చర్చలు జరిగాయి. సమాచారం పొందలేకపోతున్న ప్రజలు ‘స్క్రోల్స్, ట్రోల్స్ అండ్ పోల్స్: ఇన్ఫర్మేషన్ అండ్ డెమొక్రసీ ఇన్ ఇండియా’అనే అంశంపై కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ మాడభూషి శ్రీధర్ మాట్లాడారు. సామాన్య ప్రజలు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారాన్ని పొందలేకపోతున్నారని, ప్రభుత్వం మాత్రం ఆధార్ సాకుతో ప్రజల వ్యక్తిగత జీవితాన్ని, అన్ని వివరాలను సేకరించి పెట్టుకుందన్నారు. మీడియా కూడా వ్యక్తుల గోప్యతకు, దేశ భద్రత వంటి అంశాలపై తప్పుడు కథనాలను ప్రసారం చేస్తోందన్నారు. 1960 నుంచి ఇటీవల వర కు క్రికెట్‌ను, సమాజాన్ని ప్రభావితం చేసిన 11 మంది క్రీడాకారుల గురించి తాను రాసిన ‘డెమొక్రసీస్ లెవెంత్: ది గ్రేట్ ఇండియన్ క్రికెట్ స్టోరీ’ పుస్తకంపై సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ మాట్లాడారు. ఒకప్పుడు ఆటవిడుపు కోసం మొదలైన క్రికెట్ ఆ తర్వాత యావత్ సమాజాన్ని ప్రభావితం చేసే గొప్ప క్రీడాకారులను అందజేసిందన్నారు. -
దద్దరిల్లిన బెంగళూరు
సాక్షి, బెంగళూరు : సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ దారుణ హత్యకు నిరసనగా ఇవాళ (మంగళవారం) చేపట్టిన ర్యాలీతో బెంగుళూరు వీధులు జనసంద్రంగా మారాయి. గౌరి హత్య విరోధి వేదిక ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా తరలి వచ్చిన సుమారు 50వేలమంది ఆందోళనకారులతో బెంగళూరులోని సెంట్రల్ కాలేజీ గ్రౌండ్ దద్దలిల్లింది. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పాత్రికేయులు, రచయితలు, కవులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్ధులు బెంగళూరు రైల్వేస్టేషన్నుంచి సెంట్రల్ కాలేజీవరకు ర్యాలీ నిర్వహించారు. ఆమ్ ఆద్మీనేత ఆసిష్ ఖేతన్, దళిత నేత జిగ్నేష్ మేవాని, రచయిత సాయినాధ్లతో పాటు వామ పక్షపార్టీలకు చెందిన నాయకులు, పలు దళిత , మహిళా సంఘాలు, ఇతర ప్రజాసంఘాలు సహా ఆమ్ ఆద్మీ పార్టీ బెంగళూరు విభాగం ఈ నిరసన ర్యాలీలో పాల్గొంది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు జర్నలిస్టు నాయకులు, వామపక్షనేతలు, జర్నలిస్టులు, విద్యార్థి, మహిళా, కార్మికనేతలు తరలి వెళ్లారు. ర్యాలీ అనంతరం జరిగిన సభకు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు మేథా పాట్కర్, తీస్తా సెతల్వాద్, ఆనంద్ పట్వర్ధన్, కవితా కృష్ణన్, జిగ్నేష్ మేవాని హాజరయ్యారు. పెన్నునే ఆయుధంగా మలిచి పోరాడారు.. ఐయామ్ గౌరీ లంకేశ్ మహా ప్రదర్శనలో పాల్గొన్న ప్రముఖ ఉద్యమకారిణి మేథా పాట్కర్ ... దబోల్కర్ లాంటి నేతలను హత్య చేసిన సనాతన సంస్థ లాంటి సంఘాలు గోవాలాంటి చోట్ల ఇంకా ఉండటంపట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా ఉందంటే అది గౌరీలాంటి హేతువాదుల వల్లనే అని, తన పెన్నునే ఆయుధంగా మలిచి పోరాడారన్నారు. ఛాందసవాదాన్ని తుదకంటా ఎదిరించి పోరాడిన వ్యక్తి గౌరి అని, కుల్బుర్గిని హత్య చేసిన హంతకులను సీఎం సిద్ధరామయ్య రెండేళ్లు అయినా ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారని ప్రశ్నించారు. గౌరిని హత్య చేసిన హంతకులకు శిక్షపడే దాకా పోరాటం ఆగదని, న్యాయం జరిగేవరకూ అందరం కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. అంతిమ విజయం సాధించేవరకూ యుద్ధం మరింత ఉధృతంగా సాగాలని మేథా పాట్కర్ సూచించారు. గౌరి ఫైర్ బ్రాండ్ రైటర్... తీస్తా సెతల్వాద్ మాట్లాడుతూ... ‘నేను గౌరి 1960లో పుట్టాం. అయినా తన నన్ను చిన్న చెల్లి అని పిలిచేది. ఆమె నుంచి నేను చాలా నేర్చుకున్నాను. గౌరి పట్ల యావత్ జాతి కదిలి రావడం నన్ను ఆశ్చర్యపరుస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువలా వస్తోంది. స్థానిక భాషలో ఆమె ఫైర్ బ్రాండ్ రైటర్. మేమిద్దరం చాలాచోట్లకి కలిసి ప్రయాణించాం. ఆమె హేతువాద ధోరణి కులం పట్ల ప్రశ్నించేలా చేసింది. బసవన్న తుకారాం సంప్రదాయాలను ఆమె సమర్థించింది. లౌకిక వాదం, భిన్నత్వం ఈ దేశ అస్తిత్వాలు. ఇవి విదేశీ సంస్కృతీ కాదు. ఫాసిస్టు శక్తులు ఈ సంస్కృతిని మన నుంచి తీసుకుపోలేవు. కేవలం నిజాలు మాత్రమే మాట్లాడగల ధైర్యం కలిగిన నాయకురాలు గౌరి. ఆమె నుంచి మనం నేర్చుకోవలసింది ఎంతోవుంది. మన వైఖరి సంకుచితంగా ఉండకూడదన్న విషయం గుర్తుంచుకోవాలి. దేశవ్యాప్తంగా అందరూ ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఇది. గౌరి పోరాటం ..ఆమె మరణం వృధాగా పోకూడదు.’ అని అన్నారు. కాగా ఈ నెల 6వ తేదీన...గౌరీ లంకేశ్ బెంగుళూరులోని తన నివాసంలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. -
మానవహక్కులు అణచివేస్తే సహించం
గౌరీ లంకేశ్ హత్యపై నినదించిన ప్రముఖులు సాక్షి, హైదరాబాద్: సీనియర్ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్యపై ప్రజా, హక్కుల సంఘాలు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని నడివీధిలో హత్య చేస్తుంటే సహించేది లేదని హెచ్చరించారు. మతం, కులం పేరుతో మానవ హక్కులను అణచివేస్తే సమాజం చూస్తూ ఊరుకోదన్నారు. శుక్రవారం ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన కార్యక్రమంలో కర్ణాటకలో హత్యకు గురైన పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌కు వందలాది మంది నివాళులర్పించారు. నేను సైతం గౌరి... గౌరీ లంకేశ్ హంతకులను కఠినంగా శిక్షించాలి... మతోన్మాదం నశించాలి.. అంటూ నినదించారు. ‘మతోన్మాదంపై ఒంటరిగా పోరాడి మరణించినా.. అక్షరాలను ఆయుధాలుగా మలిచి గెలిచింది గౌరీ లంకేశ్. ఆమె ఇప్పుడు గతం కాదు. వర్తమానం, భవిష్యత్తు కూడా’అంటూ ప్రముఖులు శ్లాఘించారు. ఆమె మరణాన్ని జయించిన కలం యోధురాలని కొనియాడారు. దాడులు, బెదిరింపులు, హత్యలతో భావ ప్రకటనా స్వేచ్ఛని, ప్రజాస్వామ్యాన్ని హరించలేవన్నారు. అసహనాన్ని అంతం చేద్దాం.. హత్యారాజకీయాలను తిప్పికొడదాం అంటూ గౌరీ లంకేశ్ తన చివరి శ్వాసతో ప్రజల్లో కొత్తశ్వాస నింపారని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యావేత్త చుక్కారామయ్య, విరసం నేత వరవరరావు, సీపీఐ నేత కె.నారాయణ, జర్నలిస్టు నాయకుడు అమర్, ప్రెస్ అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ, మల్లేపల్లి లక్ష్మయ్య, ఎన్.వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. 12న చలో బెంగళూరు.. గౌరీ లంకేశ్ హత్యకు నిరసనగా ఈ నెల 12న చలో బెంగళూరు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు అల్లం నారాయణ చెప్పారు. బెంగళూరులో జరిగే నిరసన ప్రదర్శనలో పాత్రికేయులంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. గౌరీ లంకేశ్ హంతకులను కఠినంగా శిక్షించాలి న్యాయవాదుల డిమాండ్ ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్యను ఉమ్మడి హైకోర్టు న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. గౌరి హత్యపై న్యాయవాదులు శుక్రవారం భోజన విరామ సమయంలో హైకోర్టు బయట నిరసన తెలియచేశారు. హంతకులను కఠినంగా శిక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఐలు, ఐఏఎల్, ఏపీసీఎల్సీ, ఏపీసీఎల్ఏ తదితర సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాటిబండ్ల ప్రభాకరరావు, కె.పార్థసారథి, వి.రఘునాథ్, ఎన్.మాధవరావు, పి.సురేశ్‌కుమార్, బొమ్మగాని ప్రభాకర్, తిరుమలశెట్టి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆమెకు సెక్యురిటీ ఎందుకివ్వలేదు?
న్యూఢిల్లీ: మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్నా పాత్రికేయురాలు, సామాజిక వేత్త గౌరీ లంకేశ్‌కు కర్ణాటక ప్రభుత్వం ఎందుకు భద్రత కల్పించలేదని కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వ అంగీకారంతోనే మావోయిస్టులతో గౌరి చర్చలు జరిపారని, ఆమెకు ఎందుకు సెక్యురిటీ ఇవ్వలేదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అడిగారు. ప్రజాస్వామ్యంలో ప్రతి హత్యను ఖండించడం కరెక్టేనని.. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్-బీజేపీ కార్యకర్తల హత్యలపై ఉదారవాదులు ఎందుకు నోరు విప్పలేదని ఆయన నిలదీశారు. సంఘ్ కార్యకర్తలకు మానవ హక్కులు లేవా అని ప్రశ్నించారు. రాజకీయ హత్యలపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని మండిపడ్డారు. గౌరి లంకేశ్ హత్య కేసులో దర్యాప్తు ప్రారంభం కావడానికి ముందే.. ఆర్ఎస్ఎస్ హస్తముందని రాహుల్ గాంధీ బహిరంగంగా ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ‘సిట్’ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని తాము ఎలా నమ్మగలమన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో కర్ణాటక ముఖ్యమంత్రి ఏకీభవిస్తారా అని ప్రశ్నించారు. కర్ణాటకలో శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శించారు. -
గౌరీ లంకేష్ హత్యను ఖండిస్తూ నిరసన
-
తుపాకీతో నిజం గొంతుకను నొక్కేశారు: కమల్
సాక్షి, చెన్నై: రాజకీయాలపై స్పష్టమైన సంకేతాలు ఇవ్వకుండా అభిమానుల్లో గందరగోళం నెలకొల్పుతున్నారు లోక నాయకుడు కమల్ హాసన్. అయితే ప్రముఖ అంశాలపై మాత్రం నిత్యం తన ట్విట్టర్ లో స్పందిస్తూనే వస్తున్నారు. నీట్ వివాదం-అనిత సూసైడ్‌పై ట్వీట్లు చేసిన కమల్.. ఇప్పుడు ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య ఉదంతంపై స్పందించారు. ‘‘చర్చలో ఓడిపోతామన్న భయంతో తుపాకీతో నిజం గొంతుకను చంపేశారు. ఇంతకన్నా దారుణం మరోకటి లేదు. గౌరీ లంకేశ్ మరణంపై ఆమె కుటుంబ సభ్యులకు, మద్ధతుదారులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అంటూ కమల్ ఈ ఉదయం ఓ ట్వీట్ చేశారు. Silencing a voice with a gun is the worst way to win a debate. Condolence to all those who are grieving Gauri Lankesh's demise. — Kamal Haasan (@ikamalhaasan) September 7, 2017 'లంకేశ్ పత్రికే' అనే కన్నడ వీక్లీ టాబ్లాయిడ్‌ను ఆమె నడిపిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి మోటర్ బైక్ పై వచ్చిన దుండగులు ఆమెను కాల్చి హత్య చేసి పారిపోయారు. ఆమె హత్య వెనుక బీజేపీ, ఆరెస్సెస్ నేతల హస్తం ఉందంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించగా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆ ఆరోపణలను తిప్పి కొట్టారు. అయితే ఆమె సోదరుడు మాత్రం మావోయిస్టుల హస్తం ఉండి ఉండొచ్చన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. -
లంకేశ్ హత్య: హైదరాబాద్ జర్నలిస్టుల ఖండన
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ జర్నలిస్ట్, రచయిత గౌరీ లంకేశ్ హత్యను హైదరాబాద్ జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి. బషీర్ బాగ్ చౌరస్తాలో గౌరి లంకేశ్ హత్యను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. హత్య పై విచారణ జరిపించి హత్య వెనుక ఉన్నవారిని గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. గతంలో జరిగిన మూడు హత్యలపై ఇప్పటి వరకు స్పందించని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. జర్నలిస్టులకు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రజాసంఘాలు నేతలు, సామాజిక కార్యకర్తలు, పలు పార్టీ నేతలు తరలి వచ్చారు. నిరసనలో ప్రముఖ జర్నలిస్ట్ నాయకులు దేవుల పల్లి అమర్, సాక్షి ఈడీ రామచంద్ర మూర్తి, ఐజేయూ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, పీఓడబ్ల్యూ సంధ్య, సామాజిక కార్యకర్త దేవి, టీపీఎఫ్ నాయకులు కృష్ణ తదీతరులు పాల్గొన్నారు. -
'రాహుల్.. ఆ హత్యతో మాకు సంబంధం లేదు'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య విషయంలో తమకుగానీ, తమకు చెందిన ఏ సంస్థకుగానీ ఎలాంటి సంబంధం లేదన్నారు. బెంగళూరులోని తన నివాసం వద్ద ప్రముఖ జర్నలిస్టు అయిన గౌరీ లంకేష్ దారుణ హత్యకు గురై చనిపోయిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన రాహుల్ మాట్లాడుతూ బీజేపీకి, ఆరెస్సెస్‌కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిపై దాడులు జరుగుతాయని, హత్యలు కూడా చేస్తారని ఆరోపించారు. భారత్‌కు విరుద్దమైన భావజాలాన్నే వారు రుద్దాలని అనుకుంటారని, దానిని ఎవరు వ్యతిరేకించినా ఒప్పుకోరన్నారు. దీనిపై నితిన్ గడ్కరీ స్పందిస్తూ.. 'రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలు అవాస్తవాలు, నిరాధారాలు. గౌరీ లంకేష్ ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదు. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం, మా సంస్థలకు ఎలాంటి సంబంధం లేదు. మేం దీనిని ఖండిస్తున్నాం' అని ఆయన అన్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా రాహుల్ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. ప్రధాని అంటే ఏదో ఒక పార్టీకి చెందిన వ్యక్తికాదు. ఆయన దేశానికి ప్రధాని' అని గడ్కరీ చెప్పారు.