
ఆమెకు సెక్యురిటీ ఎందుకివ్వలేదు?
న్యూఢిల్లీ: మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్నా పాత్రికేయురాలు, సామాజిక వేత్త గౌరీ లంకేశ్‌కు కర్ణాటక ప్రభుత్వం ఎందుకు భద్రత కల్పించలేదని కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వ అంగీకారంతోనే మావోయిస్టులతో గౌరి చర్చలు జరిపారని, ఆమెకు ఎందుకు సెక్యురిటీ ఇవ్వలేదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అడిగారు. ప్రజాస్వామ్యంలో ప్రతి హత్యను ఖండించడం కరెక్టేనని.. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ కార్యకర్తల హత్యలపై ఉదారవాదులు ఎందుకు నోరు విప్పలేదని ఆయన నిలదీశారు. సంఘ్ కార్యకర్తలకు మానవ హక్కులు లేవా అని ప్రశ్నించారు. రాజకీయ హత్యలపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని మండిపడ్డారు.
గౌరి లంకేశ్ హత్య కేసులో దర్యాప్తు ప్రారంభం కావడానికి ముందే.. ఆర్‌ఎస్‌ఎస్ హస్తముందని రాహుల్ గాంధీ బహిరంగంగా ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ‘సిట్’ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని తాము ఎలా నమ్మగలమన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో కర్ణాటక ముఖ్యమంత్రి ఏకీభవిస్తారా అని ప్రశ్నించారు. కర్ణాటకలో శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శించారు.