పాట్నా: జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) జాతీయ అధ్యక్షుడు, బిహార్ ఎంపీ లలన్ సింగ్.. ప్రధాని నరేంద్ర మోదీ వెనుకబడిన తరగతికి(బీసీ) చెందిన వ్యక్తి అని అన్నారు. అయితే గుజరాత్ సీఎం అయ్యాక తన కులాన్ని ఈబీసీలో విలీనం చేశారని ఆరోపించారు. ఆయన డూప్లికేట్ వ్యక్తి అని తీవ్ర విమర్శలు చేశారు. 10 ఏళ్లు ప్రధానిగా ఉన్న వ్యక్తి ప్రజలకు అన్ని వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కానీ దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగంపై ప్రధాని ఏనాడూ నోరువిప్పలేదని ధ్వజమెత్తారు.
అలాగే బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని లలన్ సింగ్ ఆరోపించారు. అందుకే కుల ఆధారిత జనగణనను ఆ పార్టీ వ్యతిరేకిస్తోందని ధ్వజమెత్తారు. అలా జరిగితే వాళ్ల నిజ స్వరూపం ప్రజలకు తెలుస్తుందని బీజేపీ భయపడుతోందని వ్యాఖ్యానించారు. జేడీయూ కార్యకర్తల సమావేశంలో ఈ మేరకు లలన్ సింగ్ మాట్లాడారు.
బీజేపీ కౌంటర్
అయితే లలన్ సింగ్ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఆయన సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడింది. లలన్ సింగ్, నితీశ్ కుమార్ బీజేపీతో పొత్తు పెట్టుకుని, మోదీ ఫోటోతోనే గెలిచారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఆ పార్టీ నేత రవి శంకర్ ప్రసాద్ అన్నారు. రాజకీయ ప్రమాణాలు దిగజారవద్దని హితవు పలికారు. చిన్న చితకా నాయకులు ఏం మాట్లాడినా తాము పట్టించుకోమని కానీ, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం సహించేది లేదని తేల్చిచెప్పారు.
చదవండి: కశ్మీరీ పండిట్లపై మళ్లీ పేలిన తూటా.. ఒకరు మృతి
Comments
Please login to add a commentAdd a comment