
పెళ్లి పందిట్లో విద్యా గురువులకు సన్మానం
గాంధీనగర్: పెళ్లంటే నూరేళ్ల పంట అని, అందరికి గుర్తుండిపోయేలా అట్టహాసాలు, ఆర్భాటాలతో పెళ్లి చేసుకోవాలని కలలు కంటారు కన్నెలెందరో. గుజరాత్‌లోని హల్దారు గ్రామానికి చెందిన 22 ఏళ్ల నిషాద్‌బాను వాజిఫ్‌దార్ మాత్రం అలా ఆలోచించలేదు. వీలైనంత తక్కువ ఖర్చులో సాదాసీదాగా పెళ్లి చేసుకొని అలా మిగిల్చిన డబ్బును నలుగురికి ఉపయోగపడేందుకు ఖర్చు చేయాలని నిర్ణయించుకుంది.
ఇటీవలనే ఎంసీఏ కోర్సు పూర్తి చేసిన నిషాద్‌బాను తనకు నర్సరీ నుంచి ఎంసీఏ వరకు విద్యా బోధన చేసిన గురువులను, ఉన్నత విద్యనభ్యసించిన మహిళలను సముచిత రీతిన తన పెళ్లి రోజున సత్కరించాలని అభిప్రాయపడింది. అంతే, జనవరి 10 తేదీన పెళ్లి చేసుకున్న ఆమె ఆరోజున నర్సరీ నుంచి ఎంసీఏ వరకు తనకు చదువు చెప్పిన 75 మంది రిటర్డ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులను ప్రత్యేకంగా ఆహ్వానించి వారిని శాలువాలతో సత్కరించి మెమెంటోలు అందజేసింది. విద్యారంగంలో మహిళలను ప్రోత్సహించడంలో భాగంగా ఉన్నత విద్యలు చదివిన గ్రామానికి చెందిన ప్రతి ఒక్క విద్యార్థినిని ఆహ్వానించి గురువుల అనంతరం వారినీ సత్కరించింది. అంతేకాకుండా తాను చదివిన ప్రాథమిక, ప్రాతమికోన్నత పాఠశాలకు తన పెళ్లి కానుక కింద పది లక్షల రూపాయల విరాళాలు అందజేసింది.
నిషాద్‌బానును ఉన్నత చదువులు చదివించిన ఆమె తండ్రి సాధారణ రైతు అయినప్పటికీ ఆమె పెద్ద మనసును అర్థం చేసుకున్నారు. పెళ్లి కొడుకు రమీజ్ మొహమ్మద్ కూడా ఆమె సంకల్పాన్ని గౌరవించి తోడ్పడ్డారు. ఆమె కోరిక మేరకు తండ్రి కూడా అలాంకారాల లాంటి ఆర్భాటాలకు వెళ్లకపోవడమే కాకుండా సాధారణ భోజనంతో సరిపెట్టారు. ఫుడ్ కూడా ఏ మాత్రం వృధా కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు ఆమె అటు గురువులకు, విద్యార్థినులకే కాకుండా మొత్తం గ్రామానికే కొత్త స్ఫూర్తినిచ్చారు.
ఆమె తన ఫోటోను లేదా గురువుల సన్మానాల ఫోటోలను ప్రచురించేందుకు కూడా మీడియాను అనుమతించలేదు. తాను ఇదంతా ప్రచార ఆర్భాటాల కోసం చేయడం లేదని, తన సంకల్పం దీనికి అతీతమని చెప్పి మొత్తం సమాజానికే నేడు స్ఫూర్తిగా నిలిచారు.