
కిర్పాల్ బాడీలో అవయవాలు మిస్సింగ్
అట్టారి: పాకిస్థాన్ జైలులో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన కిర్పాల్ సింగ్ శరీరంలోని కీలక అవయవాలు మాయమయ్యాయి. పాక్ నుంచి స్వదేశానికి చేరుకున్న కిర్పాల్ పార్థీవదేహంలో గుండె, కాలేయం అవయవాలు లేవని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. 2013లో లాహోర్ జైల్లో మృతి చెందిన సరబ్ జీత్ సింగ్ విషయంలోనూ ఇలాగే జరిగింది. స్వదేశానికి తరలించిన సరబ్ జీత్ సింగ్ భౌతికకాయంలో కీలక అవయవాలు లేనట్టు అప్పట్లో గుర్తించారు.
ఇప్పుడు కిర్పాల్ విషయంలోనూ ఇలా జరగడంతో అనుమానాలు బలపడుతున్నాయి. కిర్పాల్ ను హత్య చేశారని, ఇది బయట పడుతుందన్న భయంతో అవయవాలు మాయం చేశారని అతడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. జైలులో అతడిని చిత్రహింసలు పెట్టారని వాపోయారు. కిర్పాల్ మృతదేహంపై దెబ్బల తాలుకా గుర్తులు ఉన్నాయని తెలిపారు.
ఏప్రిల్ 11న లాహోర్ లోని జిన్నా ఆస్పత్రిలో కిర్పాల్ సింగ్ మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని మంగళవారం పంజాబ్ లోని స్వస్థలానికి తరలించారు. కిర్పాల్ సింగ్ కు విషం ఇచ్చి చంపివుంటారన్న అనుమానాన్ని సరబ్ జీత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్ వ్యక్తం చేశారు. అందుకే అతడి శరీరంలోని అవయవాలను తొలగించారని ఆరోపించారు.