Kirpal Singh
-
కిర్పాల్ బాడీలో అవయవాలు మిస్సింగ్
అట్టారి: పాకిస్థాన్ జైలులో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన కిర్పాల్ సింగ్ శరీరంలోని కీలక అవయవాలు మాయమయ్యాయి. పాక్ నుంచి స్వదేశానికి చేరుకున్న కిర్పాల్ పార్థీవదేహంలో గుండె, కాలేయం అవయవాలు లేవని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. 2013లో లాహోర్ జైల్లో మృతి చెందిన సరబ్ జీత్ సింగ్ విషయంలోనూ ఇలాగే జరిగింది. స్వదేశానికి తరలించిన సరబ్ జీత్ సింగ్ భౌతికకాయంలో కీలక అవయవాలు లేనట్టు అప్పట్లో గుర్తించారు. ఇప్పుడు కిర్పాల్ విషయంలోనూ ఇలా జరగడంతో అనుమానాలు బలపడుతున్నాయి. కిర్పాల్ ను హత్య చేశారని, ఇది బయట పడుతుందన్న భయంతో అవయవాలు మాయం చేశారని అతడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. జైలులో అతడిని చిత్రహింసలు పెట్టారని వాపోయారు. కిర్పాల్ మృతదేహంపై దెబ్బల తాలుకా గుర్తులు ఉన్నాయని తెలిపారు. ఏప్రిల్ 11న లాహోర్ లోని జిన్నా ఆస్పత్రిలో కిర్పాల్ సింగ్ మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని మంగళవారం పంజాబ్ లోని స్వస్థలానికి తరలించారు. కిర్పాల్ సింగ్ కు విషం ఇచ్చి చంపివుంటారన్న అనుమానాన్ని సరబ్ జీత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్ వ్యక్తం చేశారు. అందుకే అతడి శరీరంలోని అవయవాలను తొలగించారని ఆరోపించారు. -
సోదరుని మృతదేహం కోసం..
న్యూఢిల్లి: పాకిస్థాన్ జైల్లో మృతి చెందిన భారతీయ ఖైదీ కృపాల్ సింగ్(54) పార్థివ దేహాన్ని భారత్ కు రప్పించేందుకు చర్యలు తీపసుకోవాలని కోరుతూ ఆయన సోదరి జాగిర్ కౌర్ గురువారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలిశారు. 25 ఏళ్ల క్రితం గూఢచర్యం కేసులో అరెస్ట్ అయిన కృపాల్ సింగ్.. పాకిస్థాన్ లోని కోట్ లఖ్ పత్ జైలులో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. కృపాల్ సింగ్ కుంటుంబానికి కేజ్రీవాల్ సానుభూతి తెలిపారు. మృతదేహాన్ని భారత్ కు రప్పించేందుకు తన వంతు కృషి చేస్తానని కృపాల్ సింగ్ కుటుంబ సభ్యులకు కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. -
గుండెపోటుతో కిర్పాల్ సింగ్ మృతి: పాకిస్థాన్
న్యూఢిల్లీ: భారత ఖైదీ కిర్పాల్ సింగ్ గుండెపోటుతో మృతి చెందాడని కేంద్ర ప్రభుత్వానికి పాకిస్థాన్ సమాచారం అందించింది. లాహోర్ జైల్లో రెండు రోజుల క్రితం కిర్పాల్ సింగ్ మృతి చెందాడు. ఈ నెల 11న మధ్యాహ్నం 2.55 ప్రాంతంలో కిర్పాల్ గుండెపోటుతో మృతి చెందాడని పాక్ ప్రభుత్వం తమకు తెలిపిందని విదేశాంగ కార్యదర్శి వికాస్ స్వరూప్ వెల్లడించారు. పూర్తి వివరాలు అందాల్సి ఉందని చెప్పారు. పంజాబ్ ప్రావిన్స్ లో జరిగిన సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో 25 ఏళ్లుగా లాహోర్ జైల్లో కిర్పాల్ సింగ్ శిక్ష అనుభవిస్తూ మరణించాడు. కిర్పాల్ మృతిపై అతడి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పాటు ఆందోళనకు దిగడంతో ఈ విషయాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం దృష్టికి కేంద్రం తీసుకెళ్లింది. కేంద్రం ఆదేశాలతో పాకిస్థాన్ లో భారత హైకమిషనర్ గా వ్యవహరిస్తున్న జేపీ సింగ్ బుధవారం పాక్ విదేశీ వ్యవహారాల శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. కిర్పాల్ మృతికి కారణాలను అడిగి తెలుసుకున్నారు.