అహ్మదాబాద్: గుజరాత్‌లోని జకావ్ తీరం సమీపంలో పాకిస్థాన్‌కు చెందిన సముద్ర గస్తీ సిబ్బంది దుశ్చర్యకు పాల్పడ్డారు. చేపల వేటకు వెళ్లిన ఓ బోటు సిబ్బందిపై విచక్షణరహితంగా కాల్పులు జరిపి, ఒకరిని చంపేశారు. మరో 30 మందిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోర్‌బందర్ బోట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మనీష్ లోధారి తెలిపారు. పాక్ సిబ్బంది కాల్పుల్లో నరన్ సోస అనే జాలరి మరణించినట్లు ఆయన వివరించారు. ఇతర బోట్ల నుంచి 30 మందిని అపహరించుకుపోయారని, దీనిపై స్థానిక పోలీసు, కోస్ట్‌గార్డ్ సిబ్బందికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
‘‘అంతర్జాతీయ జలాల్లో మేం వేటకు వెళ్లాం. కాసేపటికి పాకిస్థాన్ బోట్లు మమ్మల్ని చుట్టుముట్టాయి. విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. కాల్పుల్లో మాతో వచ్చిన ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. బోటులో ఉన్న మిగతా ఐదుగురం ప్రాణాలు కాపాడుకొని తీరానికి చేరుకున్నాం’’ అని మంగన్ సోసొ అనే జాలరి చెప్పారు. ఈ ఘటనపై రక్షణమంత్రి ఏకే ఆంటోనీతో మాట్లాడానని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పాక్ చర్యను సీరియస్‌గా తీసుకొని విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.