బీజేపీ నాయకురాలు పంకజ ముండే
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నిరాశాజనక ఫలితాలతో ఆ పార్టీలో అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. కాషాయ పార్టీ నేత పంకజ ముండే పార్టీని వీడిపోనున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. తన ఓటమి అనంతరం ‘భవిష్యత్ కార్యాచరణపై ఆలోచించుకోవాల్సిన సమయం’ అంటూ ఆమె వివాదాస్పద పోస్ట్ పెట్టడమే ఈ ప్రచారానికి ఊతమిచ్చింది. పంకజ్ ముండే పార్టీకి గుడ్‌బై చెబుతారన్న వార్తలు వినిపిస్తున్నక్రమంలోనే ఆమె మరోసారి పార్టీని వీడతారనే సంకేతాలు పంపారు. గురువారం జరిగిన తన తండ్రి దివంగత గోపీనాథ్ ముండే జయంతి వేడుకల్లో ఆమె పాల్గొంటూ ప్రస్తుతం తాను బీజేపీని వీడడం లేదని వివరణ ఇచ్చారు. అయితే తనను పార్టీ నుంచి పంపించేయాలనుకుంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. గత ఎన్నికల్లో కొంతమంది బీజేపీ నాయకులు తాను ఓడిపోవాలని కోరుకున్నారని ప్రస్తావించారు. అందుకే తన సోదరుడి చేతిలో ఓటమిపాలయ్యానంటూ చెప్పుకొచ్చారు. పంకజ్ ముండే వ్యాఖ్యలు బీజేపీలో అంతర్గత కలహాలను వెల్లడిస్తున్నాయి. కాగా పంకజ్ ముండే ఇటీవలి ఎన్నికల్లో పర్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సోదరుడు ధనుంజయ్ ముండే చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment