నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. మొదటి విడత ఫిబ్రవరి 23 నుంచి మార్చి 20 వరకు... రెండో విడత ఏప్రిల్ 20 నుంచి మే 8 వరకు జరుగుతాయి. తొలి విడతలో 26 రోజులు, రెండో విడతలో 19 రోజుల పాటు కొనసాగనున్న ఈ సమావేశాల్లో చర్చించేందుకు ప్రభుత్వం 44 అంశాలను తన ఎజెండాలో పొందుపరిచింది. అలాగే ఫిబ్రవరి 26న రైల్వే బడ్జెట్, 27న ఆర్థిక సర్వే, 28న సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. సోమవారం తొలిరోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
నరేంద్ర మోదీ సర్కారు ఇటీవల తీసుకువచ్చిన ఆరు ఆర్డినెన్స్‌లకు ఈ సమావేశాల్లోనే చట్టరూపం కల్పించాలని ప్రభుత్వం తలపిస్తోంది. వాటి స్థానంలో బిల్లులు తీసుకురానుంది. ఉభయ సభల్లో కొత్తగా ఏడు బిల్లులను ప్రవేశపెట్టనుంది. లోక్‌సభలో పెండింగ్‌లో ఉన్న 3, రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న 7 బిల్లులకు ఆమోదముద్ర వేయించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అధేవిధంగా ఏపీ శాసన మండలి సభ్యుల సంఖ్యను 50 నుంచి 58కి పెంచేందుకు ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014కు సవరణ తీసుకురానుంది. లోక్‌సభలో ఎన్డీఏకు పూర్తిస్థాయి మద్దతు ఉన్నా.. రాజ్యసభలో విపక్షాలదే పైచేయిగా ఉండడంతో బిల్లుల ఆమోదంలో ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పని పరిస్థితి నెలకొంది.