parliament budjet sessions
-
‘అదానీ’పై అదే దుమారం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ తొలి విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ముగిశాయి. రెండో విడత సమావేశాలు మార్చి 13న ప్రారంభం కానున్నాయి. అదానీ వ్యవహారంపై సోమవారం కూడా రాజ్యసభలో విపక్ష ఆందోళనలు కొనసాగాయి. సభ ప్రారంభానికి ముందే 14 విపక్ష పార్టీలు సమావేశమై దీనిపై చర్చించాయి. కాంగ్రెస్ సహా డీఎంకే, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, జేడీయూ తదితర పార్టీల నేతలు హాజరయ్యారు. జేపీసీ గానీ సుప్రీం న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ కమిటీకి డిమాండ్ చేయాలని నిర్ణయించాయి. అనంతరం బీఆర్ఎస్ సహా పలు విపక్ష పార్టీల ఎంపీలు సభలో వాయిదా తీర్మానాలిచ్చారు. సభ ప్రారంభమైన వెంటనే ఈ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. జేపీసీకి డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించాయి. దీనిపై ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ అభ్యంతరం తెలిపారు. జేపీసీ వేయాలని నినాదాలు చేస్తున్న 8 మంది సభ్యుల పేర్లను సైతం చదివి వినిపించారు. అయితే, వారిపై ఎలాంటి చర్యలను ప్రకటించలేదు. సభను నడిపేందుకు ఇది మార్గం కాదని, ఇప్పటికే చాలా సమయం వృథా అయిందని, సభ్యులు సహకరించాలని కోరారు. విపక్ష ఎంపీలు ఆందోళన విరమించకపోవడంతో సభను 11.50 గంటలకు వాయిదా వేశారు. సభ ఆరంభం అయ్యాక సైతం విపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో చివరికి మార్చి 13వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అదానీ గ్రూప్‌లో అవకతవకలు జరిగాయంటూ హిండెన్‌బర్గ్ సంస్థ ఇచ్చిన నివేదికపై ప్రతిపక్షాల ఆందోళనలతోనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి భాగమంతా గడిచిన విషయం తెలిసిందే. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం, ఆ తర్వాత బడ్జెట్, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, సాధారణ బడ్జెట్‌పై చర్చ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం మినహా ఇతర కార్యకలాపాలేవీ జరగలేదు. -
నేటి నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రెండో విడత సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం,, ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్)లో వడ్డీ రేట్లు తగ్గింపు, రైతులకు కనీస మద్దతు ధర, రష్యా దాడులతో అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థుల తరలింపు వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. బడ్జెట్ ప్రతిపాదనలకు పార్లమెంటు ఆమోద ముద్ర, కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టడం కేంద్ర ప్రభుత్వం అజెండాలో ప్రధానమైనవి. సోమవారం లోక్‌సభ కార్యకలాపాలు మొదలు కాగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కశ్మీర్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆ తర్వాత సమావేశాల్లో దానిపై చర్చ జరుగుతుంది. రాజ్యాంగ (షెడ్యూల్డ్ ట్రైబ్స్) ఆదేశాల (సవరణ) బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోద ముద్ర వేయించుకోవాలని కేంద్రం యోచిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు అదుపులోకి రావడంతో పార్లమెంటు ఉభయ సభలు యథావిధిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు జరగనున్నాయి. ఈ సారి సమావేశాలు ఏప్రిల్ ఎనిమిదో తేదీన పూర్తికానున్నాయి. ప్రజా సమస్యలపై చర్చించాలి : కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదివారం ఉదయం పార్టీ పార్లమెంటు వ్యూహాల గ్రూప్ సభ్యులతో సమావేశమయ్యారు. సభలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఒకే భావజాలం కలిగిన పార్టీలతో సమన్వయంతో పని చేయాలని నిర్ణయానికొచ్చారు. బడ్జెట్ రెండో విడత సమావేశాల్లో ప్రజా ప్రాధాన్యత కలిగిన అంశాలను లేవనెత్తి, వాటిపై చర్చ జరిగేలా చూస్తామని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు. -
బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయం
న్యూఢిల్లీ: బడుగు, బలహీన వర్గాలకు, రైతులకు, మహిళలకు ప్రభుత్వం పాముఖ్యతనిస్తుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. వారి రక్షణకు, భద్రతకోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెడుతున్నామన్నారు. సోమవారం ఆరంభమైన బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. 2022 కల్లా దేశంలో అందరికీ గృహవసతి కల్పిస్తామని రాష్ట్రపతి చెప్పారు. బాలికల విద్య, రక్షణ కోసం బేటీ బచావో.. బేటీ పఢావో, ఢిల్లీలో మహిళల రక్షణ కోసం హిమ్మత్ యాప్ ను ప్రకటించారు. 7.7 వృద్ధి రేటుతో భారతదేశం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రభుత్వ చర్యల వల్లే ద్రవ్యోల్బణం రికార్డుస్థాయిలో తగ్గిందన్నారు. నల్లధనాన్ని అరికట్టేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. భారత అంతర్గత రక్షణకు పెనుసవాలుగా మారిన తీవ్రవాదాన్ని ప్రభుత్వం సమర్ధంగా ఎదుర్కొంటుందని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. ఇంకా రాష్ట్రపతి ఏం మాట్లాడారంటే.. కశ్మీర్ లో నిర్వాసితులైన 60 వేల కశ్మీరీ పండిట్ల పునరావాసానికి కట్టుబడి ఉన్నాం, వారికనుకూలమైన వాతావరణాన్నికల్పించాడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఆగష్టు 15కల్లా దేశంలోని ప్రతీ పాఠశాలలో మరుగుదొడ్ల సౌకర్యం, విద్యుత్ సరఫరా , నదుల అనుసంధానం, బొగ్గు వేలం కేంద్రాల ఏర్పాటు తదితర కార్యక్రమాలుంటాయి. భారతదేశానికి పొరుగు దేశాలతో సంబంధాలు మెరుగు పడుతున్నాయి. చైనా, రష్యా, అమెరికా దేశాలతో మన సంబంధాలు మరింత మెరుగుపడ్డాయి. పరమ పవిత్రమైన ప్రజాస్వామ్యంలో పార్లమెంటు ఒక గర్భగుడి లాంటిది. దేశంలోని ప్రజలు ముఖ్యంగా బడుగు బలహీనవర్గాలు, తమ ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చుకోడానికి ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకాన్ని కొనసాగిస్తున్నారు. -
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. మొదటి విడత ఫిబ్రవరి 23 నుంచి మార్చి 20 వరకు... రెండో విడత ఏప్రిల్ 20 నుంచి మే 8 వరకు జరుగుతాయి. తొలి విడతలో 26 రోజులు, రెండో విడతలో 19 రోజుల పాటు కొనసాగనున్న ఈ సమావేశాల్లో చర్చించేందుకు ప్రభుత్వం 44 అంశాలను తన ఎజెండాలో పొందుపరిచింది. అలాగే ఫిబ్రవరి 26న రైల్వే బడ్జెట్, 27న ఆర్థిక సర్వే, 28న సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. సోమవారం తొలిరోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. నరేంద్ర మోదీ సర్కారు ఇటీవల తీసుకువచ్చిన ఆరు ఆర్డినెన్స్‌లకు ఈ సమావేశాల్లోనే చట్టరూపం కల్పించాలని ప్రభుత్వం తలపిస్తోంది. వాటి స్థానంలో బిల్లులు తీసుకురానుంది. ఉభయ సభల్లో కొత్తగా ఏడు బిల్లులను ప్రవేశపెట్టనుంది. లోక్‌సభలో పెండింగ్‌లో ఉన్న 3, రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న 7 బిల్లులకు ఆమోదముద్ర వేయించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అధేవిధంగా ఏపీ శాసన మండలి సభ్యుల సంఖ్యను 50 నుంచి 58కి పెంచేందుకు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014కు సవరణ తీసుకురానుంది. లోక్‌సభలో ఎన్డీఏకు పూర్తిస్థాయి మద్దతు ఉన్నా.. రాజ్యసభలో విపక్షాలదే పైచేయిగా ఉండడంతో బిల్లుల ఆమోదంలో ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పని పరిస్థితి నెలకొంది. -
రేపటి నుంచే సభా సమరం!
సాక్షి, న్యూఢిల్లీ: సభా సమరానికి తెరలేవనుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆర్డినెన్స్‌లపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. విపక్షాలను దీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కూడా సమాయత్తమైంది. మొత్తమ్మీద తాజాగా వెలుగుచూసిన కార్పొరేట్ గూఢచర్యంతోపాటు భూసేకరణ ఆర్డినెన్స్‌లతో ఉభయసభలు దద్దరిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 23 నుంచి మార్చి 20 వరకు, ఏప్రిల్ 20 నుంచి మే 8 వరకు రెండు విడతలుగా సమావేశాలు జరగనున్నాయి. తొలి విడతలో 26 రోజులు, రెండో విడతలో 19 రోజుల పాటు కొనసాగనున్న ఈ సమావేశాల్లో చర్చించేందుకు ప్రభుత్వం 44 అంశాలను తన ఎజెండాలో పొందుపరిచింది. సోమవారం తొలిరోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మోదీ సర్కారు ఈనెల 26న రైల్వే బడ్జెట్, 27న ఆర్థిక సర్వే, 28న సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇటీవల తీసుకువచ్చిన ఆరు ఆర్డినెన్స్‌లకు ఈ సమావేశాల్లోనే చట్టరూపం కల్పించాలని ప్రభుత్వం తలపోస్తోంది. వాటి స్థానంలో బిల్లులు తీసుకురానుంది. ఉభయ సభల్లో కొత్తగా ఏడు బిల్లులను ప్రవేశపెట్టనుంది. లోక్‌సభలో పెండింగ్‌లో ఉన్న 3, రాజ్యసభలో పెండిం గ్లో ఉన్న 7 బిల్లులకు ఆమోదముద్ర వేయిం చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఏపీ శాసన మండలి సభ్యుల సంఖ్యను 50 నుంచి 58కి పెంచేందుకు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014కు సవరణ తీసుకురానుంది. లోక్‌సభలో ఎన్డీఏకు పూర్తిస్థాయి మద్దతు ఉన్నా.. రాజ్యసభలో విపక్షాలదే పైచేయిగా ఉండడంతో బిల్లుల ఆమోదంలో ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పని పరిస్థితి నెలకొంది. నేడు అఖిలపక్షంతో వెంకయ్య సమావేశం సభలో చర్చించాల్సిన బిల్లులపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఆదివారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌లపై పూర్తిస్థాయి చర్చకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్న ప్రభుత్వం.. అందుకు సహకరించాల్సిందిగా విపక్షాలను కోరనుంది. స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా మధ్యాహ్నం వివిధ పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాల్సిందిగా ఆమె కోరనున్నారు. వ్యూహంపై కాంగ్రెస్ కసరత్తు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ శనివారం పార్టీ సీనియర్ నేతలతో చర్చించారు. ఆంటోని, గులాం నబీఆజాద్, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున్‌ఖర్గే, లోక్‌సభలో పార్టీ చీఫ్ విప్ జ్యోతిరాదిత్యసింథియా తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. -
జూలై రెండో వారంలో బడ్జెట్ సమావేశాలు!
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ (2014-15 ఆర్థిక సంవత్సరానికి)ను జూలై 11న నరేంద్ర మోడీ ప్రభుత్వం సమర్పించనుందనే సంకేతాల నేపథ్యంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జూలై రెండో వారం నుంచే ప్రారంభం కావచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్స్‌లు, ప్రధాని ప్రధాన కార్యదర్శిగా ట్రాయ్ మాజీ అధిపతి నృపేంద్ర మిశ్రాను నియమించే అంశం ఈ సమావేశాల్లో చర్చకు రానున్నాయి. మరోవైపు రాజ్యసభలో 60 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు గురువారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, జూలై రెండో వారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. నిర్దిష్టంగా ఎప్పుడు ప్రారంభించేదీ కేబినెట్ నిర్ణయిస్తుందన్నారు. అయితే బడ్జెట్ సమావేశాలు జూలై 7 నుంచే ప్రారంభమవుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గత పార్లమెంట్ ఆమోదించిన ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ గడువు జూలై 31తో ముగుస్తుంది. ఇక ఈ బడ్జెట్ సమావేశాల్లో లోక్‌సభ ఉపసభాపతి ఎన్నిక ఉంటుందని వెంకయ్యనాయుడు చెప్పారు. సభలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అనేది సభాపతి పరిధిలో ఉంటుందని, దీనిపై ఏమీ వ్యాఖ్యానించబోనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.