న్యూఢిల్లీ: బడుగు, బలహీన వర్గాలకు, రైతులకు, మహిళలకు ప్రభుత్వం పాముఖ్యతనిస్తుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. వారి రక్షణకు, భద్రతకోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెడుతున్నామన్నారు. సోమవారం ఆరంభమైన బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు.
2022 కల్లా దేశంలో అందరికీ గృహవసతి కల్పిస్తామని రాష్ట్రపతి చెప్పారు. బాలికల విద్య, రక్షణ కోసం బేటీ బచావో.. బేటీ పఢావో, ఢిల్లీలో మహిళల రక్షణ కోసం హిమ్మత్ యాప్ ను ప్రకటించారు. 7.7 వృద్ధి రేటుతో భారతదేశం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రభుత్వ చర్యల వల్లే ద్రవ్యోల్బణం రికార్డుస్థాయిలో తగ్గిందన్నారు. నల్లధనాన్ని అరికట్టేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. భారత అంతర్గత రక్షణకు పెనుసవాలుగా మారిన తీవ్రవాదాన్ని ప్రభుత్వం సమర్ధంగా ఎదుర్కొంటుందని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. ఇంకా రాష్ట్రపతి ఏం మాట్లాడారంటే..
- కశ్మీర్ లో నిర్వాసితులైన 60 వేల కశ్మీరీ పండిట్ల పునరావాసానికి కట్టుబడి ఉన్నాం, వారికనుకూలమైన వాతావరణాన్నికల్పించాడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది.
- ఆగష్టు 15కల్లా దేశంలోని ప్రతీ పాఠశాలలో మరుగుదొడ్ల సౌకర్యం, విద్యుత్ సరఫరా , నదుల అనుసంధానం, బొగ్గు వేలం కేంద్రాల ఏర్పాటు తదితర కార్యక్రమాలుంటాయి.
- భారతదేశానికి పొరుగు దేశాలతో సంబంధాలు మెరుగు పడుతున్నాయి. చైనా, రష్యా, అమెరికా దేశాలతో మన సంబంధాలు మరింత మెరుగుపడ్డాయి.
- పరమ పవిత్రమైన ప్రజాస్వామ్యంలో పార్లమెంటు ఒక గర్భగుడి లాంటిది.
- దేశంలోని ప్రజలు ముఖ్యంగా బడుగు బలహీనవర్గాలు, తమ ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చుకోడానికి ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకాన్ని కొనసాగిస్తున్నారు.