న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ (2014-15 ఆర్థిక సంవత్సరానికి)ను జూలై 11న నరేంద్ర మోడీ ప్రభుత్వం సమర్పించనుందనే సంకేతాల నేపథ్యంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జూలై రెండో వారం నుంచే ప్రారంభం కావచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్స్‌లు, ప్రధాని ప్రధాన కార్యదర్శిగా ట్రాయ్ మాజీ అధిపతి నృపేంద్ర మిశ్రాను నియమించే అంశం ఈ సమావేశాల్లో చర్చకు రానున్నాయి. మరోవైపు రాజ్యసభలో 60 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు గురువారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, జూలై రెండో వారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.
నిర్దిష్టంగా ఎప్పుడు ప్రారంభించేదీ కేబినెట్ నిర్ణయిస్తుందన్నారు. అయితే బడ్జెట్ సమావేశాలు జూలై 7 నుంచే ప్రారంభమవుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గత పార్లమెంట్ ఆమోదించిన ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ గడువు జూలై 31తో ముగుస్తుంది. ఇక ఈ బడ్జెట్ సమావేశాల్లో లోక్‌సభ ఉపసభాపతి ఎన్నిక ఉంటుందని వెంకయ్యనాయుడు చెప్పారు. సభలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అనేది సభాపతి పరిధిలో ఉంటుందని, దీనిపై ఏమీ వ్యాఖ్యానించబోనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.