
జైపూర్: దిశ అత్యాచార ఘటన అనంతరం దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన వ్యక్తులకు కఠిన శిక్షలు పడాలని యావత్ దేశం డిమాండ్ చేసింది. ప్రస్తుతం దేశంలో అమలు అవుతున్న చట్టాలన్నీ వెంటనే సవరించాలని, మరింత కఠినంగా మార్చాలని ప్రతిఒక్కరు గలమెత్తి నినదించారు. తాజాగా దిశ అత్యాచార నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం ఆ డిమాండ్‌కు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలోనే అత్యాచార నిందితులపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేపిస్ట్‌లకు క్షమాభిక్ష అవసరం లేదని స్పష్టం చేశారు.
‘దేశంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టాలంటే ప్రస్తుతం ఉన్న చట్టాలను మరోసారి సమీక్షించాలి. అత్యాచార నిందితులను క్షమించాల్సి అవసరం లేదు. క్షమాభిక్ష పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించాలి. వాటిపై రివ్యూ జరగాలి. మహిళల రక్షణకు పౌరులు కోరుకునే చట్టం రూపొందించాల్సిన సమయం ఆసన్నమైంది’ అని వ్యాఖ్యానించారు. రాజస్తాన్‌లో ఓ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కోవింద్ ఈ మేరకు కీలక ప్రసంగం చేశారు. దేశమంతా కఠిన చట్టాలను డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కాగా నిర్భయ దోషి ఇటీవల రాష్ట్రపతికి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను కోవింద్ తిరస్కరించిన విషయ తెలిసిందే.