యూపీఎస్సీ పరీక్ష వివాదంపై దద్దరిల్లిన పార్లమెంట్
నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని విపక్షం డిమాండ్
లోక్‌సభలో దినపత్రికను చించి స్పీకర్ వైపు విసిరిన ఆర్జేడీ ఎంపీ
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) పరీక్ష వివాదం శుక్రవారం పార్లమెంటు ఉభయసభలను అట్టుడికించింది. లోక్‌సభలో ఓ ఎంపీ దినపత్రికను చించి స్పీకర్‌పైపు విసరగా, వివాదాన్ని నిర్దిష్ట గడువులోగా పరిష్కరించడానికి ప్రభుత్వం నిరాకరించడంతో రాజ్యసభలో మొత్తం విపక్షం వాకౌట్ చేసింది. రగడ మధ్య ఉభయ సభలు పలుసార్లు వాయిదాపడ్డాయి. రాజ్యసభ మధ్యాహ్న భోజనానికి ముందు మూడుసార్లు వాయిదాపడింది.
‘ఇలాగైతే కొత్త స్పీకర్‌ను ఎన్నుకోండి..’
పరీక్ష అంశంపై ఆర్జేడీ సభ్యుడు రాజేశ్ రంజన్ లోక్‌సభ వెల్‌లోకి దూసుకెళ్లి హల్‌చల్ సృష్టించారు. ఓ దినపత్రికను చేత్తో ఊపుతూ వివాదంపై ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తర్వాత దాన్ని ముక్కలుగా చించి స్పీకర్ సుమిత్రా మహాజన్ దిశగా విసిరారు. వాటిలో కొన్ని ఆమె టేబుల్‌పై పడ్డాయి. జీరో అవర్‌లో స్పీకర్.. రంజన్ ప్రవర్తన సరిగ్గా లేదని మందలించారు. దీంతో ఆయన రెండుసార్లు క్షమాపణ చెప్పారు. అంతకుముందు.. పుణే జిల్లాలో కొండచరియల ప్రమాదంపై హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన ప్రకటనపై వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. జ్యోతిరాదిత్య సింధియా(కాంగ్రెస్), పప్పూ యాదవ్(ఆర్జేడీ) కూడా దీనిపై పట్టుపట్టడంతో స్పీకర్ ఆగ్రహించారు. నోటీసు ఇస్తే చర్చకు సిద్దమని, 372 రూల్ కింద మంత్రి ప్రకటనపై వివరణ సాధ్యం కాదన్నారు. ‘మీరిలాగే సలహాలిస్తూ మొండిగా ప్రవర్తిస్తే కొత్త స్పీకర్‌ను ఎన్నుకోండి’ అని విసుక్కున్నారు. దీంతో పప్పూ క్షమాపణ చెప్పారు.
రాజ్యసభలో..: సివిల్స్ అభ్యర్థుల ఆందోళన ను పరిష్కరించడానికి సమస్యను అన్ని కోణాల్లో అధ్యయనం చేస్తున్నామని హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రాజ్యసభలో చెప్పారు. సంబంధిత కమిటీ గురువారమే నివేదిక ఇచ్చిందని, అధ్యయనం చేస్తున్నామని అన్నారు. సెలవులు రావడంతో పరిష్కారంలో జాప్యమైందని మంత్రి జితేందర్‌సింగ్ వివరణ ఇచ్చారు. దీనిపై సంతృప్తి చెందని విపక్షాలు నిర్దిష్ట గడువు కావాలని పట్టుపట్టాయి. ఇప్పటికే ఇచ్చిన వారం రోజుల గడువు దాటిపోయిందన్నాయి. సివిల్స్ అభ్యర్థుల పట్ల ఢిల్లీ పోలీసుల తీరు బాగాలేదని, అభ్యర్థులపై కేసుల వాపసు తీసుకోవాలని సీపీఎం ఎంపీ సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. సభాపతి దీనిపై ఒక ప్రతిపాదన చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని విపక్షాలు కోరాయి. అయితే తానలా ఆదేశించనని డిప్యూటీ చైర్మన్ పీజే కురియెన్ అన్నారు. ఈ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం రేగింది. అధికారపక్ష ఎంపీలు లేచి నిలబడి విపక్ష విమర్శలను తిప్పికొట్టాలని మంత్రి ప్రకాశ్ జవదేకర్ సైగ చేశారు. దీనిపై విపక్షాలు అభ్యంతరం తెలిపాయి. జవదేకర్ క్షమాపణ చెప్పాలని, లేకపోతే సభాపతి ఆయనను బయటకు పంపాలని ఎస్పీఎంపీ నరేశ్ అగర్వాల్ డిమాండ్ చేశారు. వివాద పరిష్కారంపై గడువు ప్రకటనకు ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వాకౌట్ చేశారు. కాగా, యూపీఎస్సీ అంశంపై పార్లమెంటు సమావేశాలకు అంతరాయం కలిగిస్తున్న ఎంపీల ప్రవర్తన హుందాగా లేదని, వారు మారాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.