
హనుమంతుడిలా పనిచేయండి
బీజేపీ ఎంపీలకు మోదీ పిలుపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ విజయాలను ప్రచారం చేయడానికి బీజేపీ ఎంపీలు హనుమంతుడిలా పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తాజా బడ్జెట్ సమావేశాలు ప్రభుత్వానికి విజయమని పేర్కొన్నారు. సమావేశాలు అర్థవంతంగా, ప్రయోజనకరంగా సాగాయని, జీఎస్టీ సహా పలు కీలక బిల్లులను పార్లమెంటులో ఆమోదింపజేసుకున్నామని మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అన్నారు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేయడంతో ప్రజలు పార్టీని విశ్వసించారని పేర్కొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రజలకు, ఎంపీలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని.. ఎంపీలు హనుమంతుణ్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ‘సంస్కరణలను, అభివృద్ధి ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలి.
పేదల అభ్యున్నతి కోసం కృషి చేయడానికి ఇది మనకు సువర్ణావకాశం. ప్రభుత్వ విజయాల ప్రచారం కోసం హనుమంతుడిలా పనిచేయండి. నా ఆదేశాల కోసం ఎదురుచూడకండి. లక్ష్మణుడు స్పృహతప్పినప్పడు హనుమంతుడు తాత్సారం చేయకుండా ఔషధం కోసం వెళ్లాడు’ అని అన్నారు. తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంతవరకు ‘గరీబీ హఠావో’ కేవలం నినాదంగానే ఉండేదని, ప్రజలు అసలైన అభివృద్ధిని ఇప్పుడే చూస్తున్నారని పేర్కొన్నారు.