చైనా బయల్దేరిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ : బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మధ్యాహ్నం చైనా బయల్దేరారు. ఉదయం మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమం పూర్తయ్యాక.. కొత్త మంత్రులతో సమావేశమైన అనంతరం మోదీ.. చైనా బయల్దేరి వెళ్లారు. బ్రిక్స్ సదస్సులో మోదీ ఉగ్రవాదం, సరిహద్దు సమస్యలపై సదస్సులో మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. బ్రిక్స్ సదస్సు నుంచి ఫలవంతమైన, సానుకూల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. గోవా బ్రిక్స్ సదస్సుద్వారా సాధించిన ఫలితాల గురించి తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు సైతం ఆయన అందులో పేర్కొన్నారు. బ్రిక్స్ సదస్సు అనంతరం ఆయా దేశాల ప్రతినిధులతో ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు.