సాక్షి, న్యూఢిల్లీ: నీటి వనరులను సమర్థంగా వినియోగించేందుకు జల విధానాలను ప్రక్షాళన చేయడానికి కేంద్రం ఈ నెల 20 నుంచి ఢిల్లీలో మూడు రోజులపాటు ‘జల్ మంథన్’ పేరుతో జాతీయ సదస్సు నిర్వహించనుంది. కేంద్ర జలవనరులు శాఖ ఉన్నతాధికారులు, రాష్ట్రాల సాగునీటి మంత్రులు, ఈ రంగంతో సంబంధమున్న నిపుణులు ఇందులో పాల్గొంటారు. ఎన్జీఓలు కూడా హాజరవుతాయి. జలవిధానాలను రాష్ట్రాల అవసరాలు తీర్చేలా, ప్రజలకు మేలు చేసేలా తీర్చిదిద్దేందుకు చర్చలు, సంప్రదింపులు, సలహాల స్వీకరణ కోసం దీన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.
శీఘ్ర సాగు ప్రయోజన పథకం, జల వనరుల పునరుద్ధరణ పథకం, వరద నిర్వహణ పథకాల్లో లోటుపాట్లు, కొత్త నీటి ప్రాజెక్టుల ప్రతిపాదనలు, జలవనరుల సమాచార వ్యవస్థ ఏర్పాటు తదితరాలపై విస్తృతంగా చర్చించనున్నారు. నదుల అనుసంధానంపై జరిగే చర్చలో పోలవరం వంటి ప్రాజెక్టులకు ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించే, రాష్ట్రాలు తమ వైఖరులను వెల్లడించే అవకాశముంది. జలవనరులకు సంబంధించిన అన్న అంశాలపై విస్తృతంగా చర్చించేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి పేర్కొన్నారు. నదుల అనుసంధానం విషయంలో తెలంగాణకు సంబంధించి మూడు ప్రక్రియలు జరగాల్సి ఉంది. మొదటిది, ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్‌కు, రెండోది ఇచ్చంపల్లి నుంచి టెయిల్‌పాండ్‌కు, మూడోది పోలవరం నుంచి కృష్ణా బ్యారేజీకి లింకు కలపడం. వీటన్నింటిపై ఈ సదస్సులో చర్చించే అవకాశముంది. పోలవరంపై తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు వ్యతిరేకతను వ్యక్తం చేసే సూచనలున్నాయి.
కేంద్రం వాటా పెంపుపై చర్చ..
వరద నిర్వహణ పథకం కింద 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో కేటాయించిన నిధుల్లో కేంద్ర, రాష్ట్రాల వాటా 75:25గా ఉండేది. దీన్ని 12వ ప్రణాళికలో50ః50గా మార్చారు. ప్రత్యేక హోదా రాష్ట్రాల్లో అయితే 11వ ప్రణాళిక కాలంలో 90: 10గా ఉండగా.. 12వ ప్రణాళికలో 70ః30గా చేశారు. దీనిని తిరిగి 90: 10కు మార్చాలని ఆ రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి.