
బిల్లు పెట్టామంటే ఒప్పుకోం :కారత్
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును
వ్యతిరేకించాలని కోరిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు
గందరగోళంలో ప్రవేశపెట్టిన బిల్లును
అంగీకరించేది లేదన్న కారత్
సీపీఎం ప్రధాన కార్యదర్శితో జగన్ భేటీ
సమాఖ్య స్ఫూర్తికి, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా కేంద్రం వ్యవహరించిన తీరుపై వివరణ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన తీరును తాము తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ చెప్పారు. పూర్తి గందరగోళం మధ్య ప్రవేశపెట్టిన ఆ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని, బిల్లు పెట్టామంటే ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. ఈ విషయమై తమ ఫ్రంట్‌లోని మిగతా పార్టీలతోనూ మాట్లాడతానని, ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతున్న తీరును వ్యతిరేకించేలా ఆ పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తామని.. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కారత్ హామీ ఇచ్చారు. పూర్తి అప్రజాస్వామిక పద్ధతుల్లో జరుగుతున్న విభజనను వ్యతిరేకించాలని కోరుతూ పలు జాతీయ పార్టీల నేతలను కలుస్తున్న జగన్ ఆదివారం ఉదయం సీపీఎం నేతతో భేటీ అయ్యారు. నాలుగు రోజుల కిందటే కారత్‌తో సమావేశమైన జగన్.. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టకుండా చూడాలని ఆయన్ను కోరిన సంగతి తెలిసిందే. తాజా భేటీ సందర్భంగా కేంద్రం గురువారం లోక్‌సభలో ఏ విధంగా విభజన బిల్లును ప్రవేశపెట్టిందో ఆయన వివరించారు.
సభా సంప్రదాయాలను పట్టించుకోకుండా, సమాఖ్య స్ఫూర్తికి, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించిన తీరును తెలియజేశారు. బిల్లును ప్రవేశపెట్టే సమయంలో కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఓ పథకం ప్రకారం ముందుకె ళ్లాయని, సొంత పార్టీ సభ్యులనే ఉసిగొల్పి దాడులు చేయించాయని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ పార్టీల నేతలు ఒకరినొకరు కొట్టుకున్నారని వివరించారు. ఇంత జరుగుతున్నా స్పీకర్ మాత్రం ఏకపక్షంగా, సభ్యుల నుంచి ఎలాంటి ఆమోదం తీసుకోకుండా బిల్లు ప్రవేశపెట్టామని చెప్పడాన్ని తాము ఖండిస్తున్నామని తెలిపారు. సీపీఎం సహా మిగతా జాతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించాలని జగన్ కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కారత్, ఫ్రంట్‌లోని 11 పార్టీలతో ఈ విషయమై చర్చిస్తామని తెలిపారు. బిల్లు ఎప్పుడు చర్చకు వచ్చినా తమ పార్టీ వ్యతిరేక త వ్యక్తం చేస్తుందని, తమ స్థాయిలో పోరాడతామని ఆయన హామీ ఇచ్చినట్టు సమాచారం.
హక్కులు కాలరాస్తే అంగీకరించం: కారత్
ఈ భేటీ అనంతరం కారత్ విలేకరులతో మాట్లాడారు. ‘పార్లమెంట్‌లో గురువారం జరిగిన దురదృష్టకర సంఘటనలను ఖండిస్తున్నాం. రాష్ట్ర విభ జన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టామని చెప్పడాన్ని మేము అంగీకరించట్లేదు. సభలో పూర్తిగా గందరగోళం నెలకొన్న సమయంలో బిల్లు ప్రవేశపెట్టారు. దీన్ని ప్రతిపక్ష పార్టీలు అంగీకరించవు. ఇది అత్యంత ప్రాముఖ్యమైన బిల్లు. దీనిపై పార్లమెంట్‌లో ప్రతిపార్టీ, ప్రతిఒక్కరూ చర్చలో పాల్గొని తమ అభిప్రాయం చెప్పాలి. బలవంతంగా విపక్షాలు, సభ్యుల హక్కులు కాలరాసే ధోరణితో వ్యవహరిస్తే మేము అంగీకరించబోం’ అని అన్నారు.
ఓట్లు, సీట్ల కోసం విభజన సరికాదు: జగన్
జగన్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరుగుతున్న తీరును అన్ని ప్రధాన పార్టీలు వ్యతిరేకించాలని కోరారు. వ్యతిరేకించకుంటే చెడు సంప్రదాయానికి తెరతీసినట్లేనని పేర్కొన్నారు. ‘రాష్ట్ర విభజనను, ప్రజలకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని వ్యతిరేకించాల్సిందిగా మరోమారు కారత్‌ను కోరాం. అసెంబ్లీ ఒప్పుకోకపోయినా కేంద్ర ప్రభుత్వం బలవంతంగా విభజనకు దిగుతోంది. సభలో బిల్లు ప్రవేశపెట్టిన తీరు ప్రజాస్వామ్యయుతంగా లేదు. ఎవరూ అవునని, కాదని చెప్పకుండానే పది సెకన్లలో మొత్తం ఎపిసోడ్ పూర్తయింది. ఈ అప్రజాస్వామిక విధానాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ అప్రజాస్వామిక వైఖరిని ఖండించి కారత్ మాకు మద్దతు తెలిపారు. ఈ అన్యాయంపై పోరాడేందుకు తన మద్దతు ప్రకటించారు. మాకు మద్దతు తెలిపినందుకు ఆయనకు ధన్యవాదాలు’ అని అన్నారు. రాష్ట్ర విభజన అంశం ఈ నెల 17, 18, 19 తేదీల్లో పార్లమెంట్‌లో చర్చకు రానున్నట్లు తెలుస్తోందని, ఈ అన్యాయాన్ని సభలో అన్ని పార్టీలు వ్యతిరేకించకుంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌కు జరిగిందే మరో రాష్ట్రానికి జరగవచ్చని జగన్ హెచ్చరించారు. ‘రేపు తమిళనాడుకు, మరుసటి రోజు బెంగాల్‌కు, మరికొన్ని రోజులు పోతే కర్ణాటకకు జరగొచ్చు. పార్లమెంట్‌లో 270 మంది ఎంపీలుండి ఓట్ల కోసం సీట్ల కోసం ఇలా అడ్డగోలుగా రాష్ట్రాలను విభజిస్తామంటే అది సరికాదు..’ అని అన్నారు.