శుక్రవారం సీపీఎం 22వ జాతీయ మహాసభల్లో ఏచూరితో మాట్లాడుతున్న కారత్
సాక్షి, హైదరాబాద్ : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపటమే లక్ష్యంగా పని చేయాలని సీపీఎం 22వ జాతీయ మహాసభల్లో తీర్మానించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ వంటి శక్తులను ఎదిరించే క్రమంలో వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులను ఏకం చేస్తూ ప్రజా ఉద్యమాలను నిర్మించాలని, ఈ క్రమంలో అవసరమైతే కాంగ్రెస్‌తోనూ రాజకీయ సంబంధాలను కొనసాగించాలని నిర్ణయించారు. పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ ప్రవేశపెట్టిన ముసాయిదా రాజకీయ తీర్మానంపై దాదాపు 18 గంటల సుదీర్ఘ చర్చ, 37 సవరణల ఆమోదం అనంతరం ఈ మేరకు ఏకాభిప్రాయానికి వచ్చారు. స్థానిక అవసరాల దృష్ట్యా బీజేపీయేతర ఏ పార్టీతోనైనా కలిసిపని చేయాలని నిర్ణయించారు.
ఒక తీర్మానం.. రెండు బలమైన వాదనలు
బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా పని చేయాలని, అదే సందర్భంలో కాంగ్రెస్‌తోనూ సమాన దూరం పాటించాలని ప్రకాశ్ కారత్ వాదిస్తూ వచ్చారు. దీనిపై కేంద్ర కమిటీలోనూ చర్చించి, ఆ మేరకు బుధవారం మహాసభల్లో ముసాయిదా రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు. కాంగ్రెస్‌తో రాజకీయ సంబంధాలు వద్దన్న అంశంపై పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విభేదిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు ఉండాలని తాను కోరుకోవడం లేదని, కానీ బీజేపీని గద్దె దించే క్రమంలో వామపక్ష, ప్రజాస్వామిక శక్తుల కలయిక అవసరమని, అలాంటప్పుడు అవసరమైతే కాంగ్రెస్‌తో రాజకీయ సంబంధాలు కొనసాగించాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. తీర్మానంలో కాంగ్రెస్‌తో రాజకీయ సంబంధాలు వద్దనే వాక్యానికి సవరణలు చేయాలని పట్టుబట్టారు. కేంద్ర కమిటీలో చర్చ సందర్భంగా కూడా ఆయన ఈ విషయంపై గట్టిగా పట్టుబట్టారు. సభలో ఒకే తీర్మానంపై రెండు బలమైన అభిప్రాయాలు ముందుకు రావడం పార్టీలో రసవత్తర చర్చకు దారితీసింది.
మద్దతు పలికినవారెవరు?
మహాసభల్లో రాజకీయ ముసాయిదా తీర్మానంతోపాటు ఏచూరి అభిప్రాయంపై గురు, శుక్రవారాల్లో వాడివేడి చర్చ జరిగింది. 12 రాష్ట్రాలకు చెందిన 47 మంది ప్రతినిధులు తమ అభిప్రాయాలు చెప్పారు. ముసాయిదా తీర్మానంపై మొత్తంగా 373 సవరణలను సూచించారు. మెజార్టీ సభ్యులు కారత్ ప్రతిపాదన వైపే మొగ్గు చూపినట్లు మొదట్లో కనిపించినా తర్వాత ఏచూరి అభిప్రాయానికి అనుకూలంగా పరిస్థితి మారినట్లు తెలిసింది. శుక్రవారం రాత్రి వరకు ప్రతినిధులు రాజకీయ తీర్మానంపై తమ అభిప్రాయాలను తెలియజేసి సవరణలు సూచించారు. ఏచూరి అభిప్రాయానికి పశ్చిమ బెంగాల్ నేతలు గట్టి మద్దతు ఇచ్చారు. బీజేపీని ఓడించే ప్రయత్నంలోనే అవసరమైతే కాంగ్రెస్‌తో రాజకీయ అవగాహన కొనసాగించాలని స్పష్టంచేశారు. వారికి మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన నేతలు కూడా జత కలిశారు. ఒక దశలో తమ అభిప్రాయాన్ని అంగీకరించకపోతే రహస్య ఓటింగ్ నిర్వహించాలని పట్టుబట్టినట్టు తెలిసింది.
ఏపీ నేతల ఝలక్!
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏచూరికి ఇక్కడి నేతలే ఝలక్ ఇచ్చారు. ఆయన అభిప్రాయంతో విభేదించి కారత్ తీర్మానాన్ని సమర్థించారు. కేరళ నేతలు కూడ కారత్ తీర్మానంతో ఏకీభవించారు. ఈ నేపథ్యంలో మహాసభ రెండు వర్గాలుగా చీలిపోయి వాడివేడి చర్చకు దారితీసింది. రెండు నెలల క్రితం రాజకీయ ముసాయిదా తీర్మానం రూపొందించినప్పుడు కూడా కేంద్ర కమిటీలో ఓటింగ్ జరిగింది. అప్పుడు ఏచూరి ప్రతిపాదన వీగిపోయింది. మహాసభల్లో ఓటింగ్ పెడితే కారత్ తీర్మానమే నెగ్గుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు కారత్ మధ్యాహ్నామే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాజకీయ తీర్మానంపై ఏకాభిప్రాయం కుదరకుంటే, ఓటింగ్ నిర్వహించి తుది ముసాయిదా ప్రకటిస్తామని వెల్లడించారు. శుక్రవారం రాత్రి వరకు ఓటింగ్ జరగవచ్చనే అభిప్రాయమే వ్యక్తం చేశారు. మరోవైపు రాజకీయ తీర్మానంపై ఓటింగ్‌లో తన ప్రతిపాదన వీగిపోతే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకోవాలన్న ఆలోచనలో ఏచూరి ఉన్నారని, పార్టీ చీలిపోయే ప్రమాదం ఉందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మధ్యే మార్గంగా ఏచూరి అభిప్రాయానికి తగ్గట్టుగా ముసాయిదాలో సవరణ చేశారు. కారత్ ప్రతిపాదించిన పొలిటికల్ లైన్‌లో ‘‘కాంగ్రెస్‌తో అవగాహన, ఎన్నికల పొత్తులు లేకుండా’’అనే పదాలను తొలగిస్తూ ముసాయిదాను సవరించారు. ఈ సవరణతో భవిష్యత్ ప్రజా ఉద్యమాల్లో సీపీఏం పార్టీ కాంగ్రెస్‌తో కలిసి పనిచేసే వెసులుబాటు ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment