ఇందిరాపార్క్ వద్ద ప్రతిపక్షాల మహాధర్నాలో సంఘీభావం తెలుపుతున్న మధుయాష్కీ(కాంగ్రెస్), రావుల చంద్రశేఖర్‌రెడ్డి (టీడీపీ), ఏచూరి (సీపీఎం), రేవంత్ (కాంగ్రెస్), నారాయణ (సీపీఐ), కోదండరాం (టీజేఎస్), నాగం (కాంగ్రెస్), తమ్మినేని వీరభద్రం (సీపీఎం), చాడ వెంకట్‌రెడ్డి (సీపీఐ)
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దింపడమే ఇప్పుడు నిజమైన దేశభక్తి అని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. మరో స్వాతంత్య్రోద్యమంతో ఈ దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైం దని, అందులో భాగంగా ప్రజాపోరాటం ప్రారంభమైందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా బుధవారం ఇందిరాపార్కు వద్ద ‘ప్రతిపక్షాల మహాధర్నా’ జరిగింది. ఏచూరి ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘దేశంలో మోదీ పాలన ఇలాగే సాగితే ప్రజాస్వామిక హక్కులు మిగలవు. ప్రైవేటీకరణ పేరుతో మోదీ దేశాన్ని తెగనమ్ముతున్నారు. ఆయన విధానాలను వ్యతిరేకించి ప్రశ్నించే నాయకులను ఈడీ, సీబీఐ దాడులతో బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు.
దేశ ప్రజలు కష్టాల్లో ఉంటే అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాధిపతులతో మాట్లాడేందుకు వెళ్లారు. ఈ పరిస్థితి నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ముందు దేశాన్ని కాపాడుకున్న తర్వాత ఈ దేశాన్ని మార్చుకుందాం. అందుకే జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీలు ఉద్యమానికి నడుం బిగించాయి. మోదీ పాలనపై పోరాడి దేశాన్ని కాపాడుకోవడమే దేశ ప్రజల వాగ్దానం, సంకల్పం కావాలి..’ అని ఏచూరి విజ్ఞప్తి చేశారు. ‘కరోనా కాలంలో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆదాయపు పన్ను పరిధిలోనికి రాని ప్రతి కుటుంబానికి నెలకు రూ.7,500 ఇవ్వాలి. దేశ వ్యాప్తంగా గోదాముల్లో మూలుగుతున్న ధాన్యాన్ని పేదలకు పంపిణీ చేయాలి..’ అని డిమాండ్ చేశారు.
గులాబీ చీడ వదలాలంటే మోదీని బండకేసి కొట్టాలి: రేవంత్
‘తెలంగాణకు విముక్తి కలగాలంటే గులాబీ చీడను వదిలించుకోవాలి. ఈ చీడ వదలాలంటే కేసీఆర్‌కు అండగా ఉన్న మోదీని బండకేసి కొట్టాలి. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతుంటే మోదీ, అమిత్‌షాలు ఈ దుర్మార్గుడిని అక్కున చేర్చుకుని తెలంగాణ ప్రజలను గుండెలపై తన్నిస్తున్నారు. గల్లీలో ఉన్న కేడీ, ఢిల్లీలో ఉన్న మోదీ ఒకే తాను ముక్కలు. మోదీ అధికారంలోకి వచ్చాక పెట్రో ధరల రూపంలో రూ.24 లక్షల కోట్లు ప్రజల నుంచి వసూలు చేశారు. 70 ఏళ్ల పాటు కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు కష్టించి సమకూర్చిన దేశ సంపదను మోదీ తెగనమ్ముతున్నారు. రాష్ట్రంలో నిజాం నవాబు ద్వారా సంక్రమించిన వేలకోట్ల రూపాయల విలువైన భూములను సీఎం కేసీఆర్ తెగనమ్ముతున్నారు. ఆయన శివలింగం మీద తేలులా మిగిలాడు. ఆ తేలును ఎలా తీయాలో, చెప్పు కింద ఎలా తొక్కాలో మాకు తెలుసు..’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 27న జరిగే భారత్‌బంద్‌ను, అక్టోబర్ 5న జరిగే రాస్తారోకోను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
టీఆర్‌ఎస్‌లో అసలైన డెకాయిట్లు: నారాయణ
‘టీఆర్‌ఎస్‌లో అసలైన డెకాయిట్లు ఉన్నారు. రేవంత్ ఇంటిపై దాడి లాంటి ఘటనలు పునరావృతమైతే సంగతి చూస్తాం’ అని సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ అన్నారు. మోదీ నరహంతకుడు, ప్రజా భక్షకుడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. అక్టోబర్ 5న జరిగే పోడు పోరాటంలో బాధిత ప్రజలు క్రియాశీలకంగా పాల్గొనాలని, వారి కుటుంబ సభ్యులంతా రోడ్లపైకి రావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో హక్కుల సాధనకు ఐక్యంగా పనిచేయాలని కోరారు. తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరకు సుధాకర్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ కార్యదర్శి పోటు రంగారావు, గోవర్ధన్, లిబరేషన్ కార్యదర్శి రాజేశ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, కాంగ్రెస్ ముఖ్య నేతలు షబ్బీర్ అలీ, కోదండరెడ్డి, పొన్నం ప్రభాకర్, నాగం జనార్దన్‌రెడ్డి, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డిలతో పాటు ప్రజా సంఘాల నేతలు, ఆయా పార్టీల కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దేశంలో మోదీ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగానికి మూలాలైన నాలుగు స్తంభాలను ధ్వంసం చేస్తున్నారు. లౌకిక భారతదేశం, సామాజిక స్వేచ్ఛ, సమాఖ్య స్ఫూర్తి, ఆర్థిక వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న మోదీ ఈ దేశాన్ని నిరంకుశం వైపు నడిపిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలో రాజ్యాంగం ఉనికి ప్రమాదంలో పడుతుంది. – సీతారాం ఏచూరి
తెలంగాణలో ఆఖరి పోరాటం ప్రారంభమైంది. 1969 తెలంగాణ ఉద్యమంలో ప్రపంచానికి తెలంగాణ గళం వినిపించింది. మలిదశ ఉద్యమంలో భౌగోళిక తెలంగాణ సాధ్యమైంది. ఈ ఆఖరి పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలన సాకారం కావాలి. –రేవంత్
రేవంత్ ఇంటిపై దాడి నీచ సంస్కృతి. కేసీఆరో, కేటీఆరో వస్తే మేము రేవంత్‌ను పంపుతాం. అప్పుడు మల్ల యుద్ధంలో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఒకదెబ్బకు రెండు పిట్టలు అనే తరహాలో క్షేత్రస్థాయిలో ఉద్యమాలను బలోపేతం చేయడం ద్వారా మోదీ, కేసీఆర్‌లను దెబ్బకొట్టాలి. – నారాయణ
Comments
Please login to add a commentAdd a comment