లక్నో : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్న నిరసనకారులను అణిచివేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ప్రతీకారం తీర్చుకుంటామని ఓ ముఖ్యమంత్రి ప్రకటించడం తాను తొలిసారిగా వింటున్నానని ఆమె వ్యాఖ్యానించారు. ఉత్తర్ ప్రదేశ్‌లో జరుగుతున్నదేంటో సీఎం ప్రకటనలో ప్రతిబింబిస్తోందని దుయ్యబట్టారు. అమాయక నిరసనకారులను పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం టార్గెట్ చేస్తోందని మండిపడ్డారు. బిజ్నోర్‌లో నమాజ్ కోసం వెళ్లిన యువకుడిని పోలీసులు కాల్చిచంపారని, పాల కోసం వెళ్లిన మరో వ్యక్తిని పొట్టనబెట్టుకున్నారని ఆరోపించారు.
పోలీసు కాల్పుల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఇచ్చేందుకు వెళితే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 5000 మందిని నిర్బంధంలోకి తీసుకున్నారని అన్నారు. విచారణ చేపట్టకుండానే ప్రభుత్వం ప్రజలను అరెస్ట్ చేస్తోందని విమర్శించారు. మన దేశంలో హింసకు తావులేదని, రాముడు..కృష్ణుడు కూడా దయతో మెలగాలని బోధించారని చెప్పుకొచ్చారు. కాషాయం ధరించే ముఖ్యమంత్రి మత ప్రబోధాలను అనుసరించి మసలుకోవాలని హితవు పలికారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టి అరెస్టయిన వ్యక్తుల కుటుంబాలను ప్రియాంక గాంధీ కలుసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment