
ఇస్రో ఖాతాలో మరో విజయం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఇస్రో ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ-సీ28 రాకెట్ విజయవంతంగా క్షక్షలోకి ప్రవేశించింది. శుక్రవారం రాత్రి 9.58 గంటలకు ప్రయోగించిన ఈ రాకెట్.. నిర్ణీత సమయానికి (గం.10:17 ని.లకు) నిర్దేశించినట్లుగానే ఐదు ఉపగ్రహాలను సరైన కక్షలోకి ప్రవేశపెట్టింది.
అంతరిక్ష వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఐదు బ్రిటన్ ఉపగ్రహాలను నింగికి పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన ఈ రాకెట్ ప్రయోగానికి గత రెండు రోజుల క్రితమే కౌంట్‌డౌన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. బుధవారం మొదటి దశలో రాకెట్ లో ఘన ఇంధనం నింపగా, గురువారం ఉదయం నుంచి రాకెట్‌లోని సాంకేతిక వ్యవస్థలను పరీక్షించారు.
విపత్తుల నిర్వహణ, భూ ఉపరితల పరిశీలన, వనరుల అధ్యయనం కోసం గాను బ్రిటన్‌కు చెందిన సర్రే శాటిలైట్ టెక్నాలజీ లిమిటెడ్(ఎస్‌ఎస్‌టీఎల్) రూపొందించిన ఐదు ఉపగ్రహాలను ఈ ప్రయోగంలో పీఎస్‌ఎల్‌వీ సీ28 రాకెట్ నింగికి చేర్చింది. పీఎస్ఎల్వీ-సీ-28 నింగిలోకి తీసుకెళ్లిన ఉపగ్రహాల మొత్తం బరువు 1440 కిలోలు. ఇంత బరువుగల ఉప గ్రహాలను రోదసిలోకి తీసుకెళ్లడం ఇస్రో చరిత్రలో ఇదే తొలిసారి.