కైలాష్ మానస్‌సరోవర యాత్రలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ : వివాదాల నడుమ కైలాశ్ మానససరోవర యాత్ర చేపట్టిన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ యాత్ర వివరాలు, అనుభవాలను పంచుకుంటూ ట్వీట్ చేశారు. మానససరోవర సరస్సు జలాలు ఎలాంటి కల్మషం లేకుండా, స్వచ్ఛంగా ఉన్నాయని.. ఈ సరస్సు నీటిని అందరికీ పంచుతూ.. తానేమీ కోల్పోలేదని వ్యాఖ్యానించారు. ఈ నీటిని ఎవరైనా తాగవచ్చని.. ఇక్కడ ఎలాంటి ద్వేష భావం లేదని ట్వీట్ చేశారు. అందుకే భారత్‌లో ఈ నీటిని మనం పూజిస్తామన్నారు. ఇక్కడకు రమ్మని పిలుపు వస్తేనే మనం కైలాశ్‌కు వెళతామని వ్యాఖ్యానించారు. ఈ అవకాశం తనకు లభించినందుకు తాను చాలా సంతోషంగా ఉన్నానని, ఈ తీపి ప్రయాణాన్ని మీతో పంచుకుంటున్నానని ట్వీట్‌లో రాహుల్ పేర్కొన్నారు.
ఆగస్ట్ 31న రాహుల్ తన కైలాశ్ యాత్రకు శ్రీకారం చుట్టగా 12 రోజుల పాటు ఆయన యాత్ర సాగనుంది. కాగా యాత్రకు బయలుదేరే ముందు నేపాల్‌లోని ఓ రెస్టారెంట్‌లో రాహుల్ చికెన్ లాలీపాన్స్ లాగించారనే వార్తలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఆయన పూర్తి శాకాహార వంటకాలనే ఆర్డర్ చేశారని ఈ వివాదానికి తెరదించేలా రెస్టారెంట్ వివరణ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment