
జయలలితకు రాహుల్ గాంధీ పరామర్శ
గత 15 రోజులుగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను పరామర్శించేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెన్నై చేరుకున్నారు. ఎవరికీ ముందుగా సమాచారం ఇవ్వకుండా ప్రత్యేక విమానంలో చెన్నై వచ్చిన ఆయన.. ఉదయం 11.45 గంటల సమయంలో నేరుగా ఎయిర్‌పోర్టు నుంచి అపోలో ఆస్పత్రికి వచ్చారు. పావుగంట పాటు ఆయన ఆస్పత్రి లోపలే ఉన్నారు. అయితే, ఎవరినీ నేరుగా జయలలిత వద్దకు వెళ్లనివ్వకపోతుండటంతో.. అసలు ఆయన ఆమెను చూశారా, లేదా వైద్యులతోనే మాట్లాడి వచ్చేశారా అన్న విషయం మాత్రం తెలియరావడం లేదు.
తీవ్రజ్వరం, డీహైడ్రేషన్‌తో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన ముఖ్యమంత్రి జయలలిత.. ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. ఆమె ఆరోగ్యంపై దేశవ్యాప్తంగా పలు రకాల ఆందోళనలు, అనుమానాలు నెలకొన్నాయి. ఆమె మరికొన్ని రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. అపోలో వైద్యులతో పాటు ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యబృందం, లండన్ నుంచి వచ్చిన డాక్టర్ రిచర్డ్ బాలే తదితరులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.